- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటల్లో అర్జునుడు.. పతకాల ‘మల్లికార్జునుడు’
కర్నూల్ జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ తమిళనాడు బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సత్తా చాటాడు.

దిశ, ప్రతినిధి కర్నూలు: మారుమూల గ్రామానికి చెందిన ఓ క్రీడాకారుడు జాతీయ స్థాయిలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. బాల్య దశ నుంచే క్రీడలపై మక్కువ పెంచుకొని వ్యాయామ విద్యతో పాటు ఎన్ఐఎస్ పూర్తి చేసి బాల్ బాడ్మింటన్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు A.మల్లికార్జున.
ఆటలపై మక్కువతో..
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ఏ. రమణయ్య, చిట్టెమ్మ దంపతుల కుమారుడైన మల్లికార్జున తన చిన్నతనం నుంచే ఆటలపై మక్కువ పెంచుకున్నాడు. అనేక పోటీల్లో పాల్గొని ఎన్నో ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను సొంతం చేసుకున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో చాటాడు. కేవలం ఆటలకే పరిమితం కాకుండా ఒకవైపు ఆటలు, మరోవైపు చదువులోనూ ప్రతిభ కనబరిచాడు. డీపీఈడీ, బీపీఈడీ పూర్తి చేసి, ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) నుంచి ‘అథ్లెటిక్స్ కోచ్’ సర్టిఫికెట్‌ను కూడా సాధించి క్రీడా నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడు.
సాధించిన విజయాలు
కర్ణాటక బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు జరిగిన 70వ సీనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొని అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా తమిళనాడులోని తెన్కాసిలో మార్చి 27 నుంచి 29 వరకు జరిగిన 44వ సౌత్ జోన్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కూడా విశేష ప్రతిభను చాటి రజత పతకాన్ని అందుకున్నాడు. 2017-18లో ఎస్జీఎఫ్‌లో కర్నూలు జట్టును వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. 2019లో వన్ టెన్ అడిల్స్‌లో.. అథ్లెటిక్స్‌లో జిల్లా స్థాయిలో 3వ స్థానం సాధించాడు.
ఉద్యోగ ప్రస్థానం
నంద్యాల జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, పే అండ్ పే స్కీమ్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు ఏ.మల్లికార్జున. 2025 డిసెంబర్ 31న ఈయనను విజయవాడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరిగి నంద్యాలకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నట్లు సమాచారం. భవిష్యత్ తో ఉన్నత స్థాయికి చేరుకుని అనేక మందిని ఉత్తమ క్రీడాకారులను చేయడమే తన లక్ష్యమని ఏ.మల్లికార్జున చెబుతున్నాడు.






