- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్పరి మండల కేంద్రానికి శనివారం రానున్నారు. ...

దిశ, కర్నూలు ప్రతినిధి: ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్పరి మండల కేంద్రానికి శనివారం రానున్నారు. సీఎం పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. సంజీవని కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించిన తర్వాత అవసరమైతే వర్చువల్ విధానంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులతో నేరుగా సంప్రదింపులు చేసే సౌకర్యాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తద్వారా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నిపుణుల సలహాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఐడీల నమోదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపట్టారన్నారు. అదే విధంగా ప్రభుత్వం సురక్షిత మాతృత్వం, ఉమ్మడి పేరెంటింగ్ అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తోందన్నారు. గర్భాధారణ సమయంలో బాధ్యత తల్లిదే కాకుండా తండ్రిదీ సమానమనే భావనతో షేర్డ్ పేరెంటింగ్ పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, జిల్లా వైద్యాధికారి డా.కామేశ్వర ప్రసాద్, ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
1,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత
నేడు ఆస్పరి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి సెక్టర్ల వారీగా దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలీసు అధికారి, పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం 1,500 మంది పోలీసు సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించినట్లు చెప్పారు. వీరిలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 76 మంది ఎస్ఐలు, 226 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 353 మంది కానిస్టేబుళ్లు, 95 మంది మహిళా పోలీసులు, 127 మంది హోంగార్డులు, 30 మంది మహిళా హోంగార్డులు, ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఇతర జిల్లాల పోలీసులు ఉన్నారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వీఐపీ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, మఫ్టీ పోలీసు బృందాలు ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.
అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణ మోహన్, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






