చిన్ని, కొలికిపూడిపై టీడీపీ అధిష్టానం సీరియస్.. హెడ్ ఆఫీసుకు రావాలని ఆదేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-23 10:48:00  IST  )

విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వివాదం తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్దకు చేరింది...

చిన్ని, కొలికిపూడిపై టీడీపీ అధిష్టానం సీరియస్.. హెడ్ ఆఫీసుకు రావాలని ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వివాదం తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. దీంతో ఇద్దరిపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం మంగళగిరి పార్టీ హెడ్ ఆఫీసుకు రావాలని ఆదేశించింది. పార్టీ కార్యాలయం వేదికగా ఇద్దరి మధ్య పంచాయితీపై రాష్ట్ర అధ్యక్షుడు చర్చించనున్నారు.

కాగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి మధ్య వివాదం ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు తనకు టికెట్ ఇచ్చినందుకు కేశినేని రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా మూడు విడతలుగా రూ. 60 లక్షలు ఇచ్చానని, మరో రూ. 50 లక్షలు కేశినేని చిన్ని పీఏ మోహన్ తీసుకెళ్లారని ఆరోపించారు. అంతేకాదు మిగిలిన 3.5 కోట్ల లావాదేవీలను శుక్రవారం వివరిస్తానని హెచ్చరించారు.

దీంతో ఎంపీ చిన్ని సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులకు సీట్లు అమ్ముకునే టైప్ కాదన్నారు. చంద్రబాబును అవమానించిన వారికి టికెట్లు అసలు ఇవ్వమన్నారు. కొలికిపూడి ఏ పంచన ఉన్నారో అందరికి తెలుసన్నారు.

అయితే ఈ పంచాయితీ రాజకీయ దుమారానికి కారణమైంది. ఇప్పటికే కొన్ని చోట్ల టీడీపీ నాయకులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటితోనే సరిపోతుందన్న సమయంలో కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికిపూడి రచ్చ పెను సంచలనంగా మారింది. దీంతో అప్రమత్తమైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే ఇద్దరికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారేసరికి ఇద్దరూ పార్టీ కార్యాలయానికి రావాలని పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. ఆ తర్వాతనైనా ఈ పంచాయితీకి తెరపడుతుందేమో చూడాలి.

Next Story