- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక నుంచి కఠిన నిబంధనలు.. ఉల్లంఘిస్తే ఉక్కుపాదమే..!
విజయవాడలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. వన్ వే నిబంధనలను ఉల్లంఘించి, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల(Road Accidents)ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా వన్ వే నిబంధనలను ఉల్లంఘించి, రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరంలోని కీలక ప్రాంతాలైన కనకదుర్గ వారధి, బెంజ్ సర్కిల్, కృష్ణలంక వంటి రద్దీ మార్గాల్లో నిబంధనలను అతిక్రమిస్తే ఇకపై ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల ఎదురుగా వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవడమే కాకుండా, ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిఘాను మరింత కఠినతరం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ క్రమశిక్షణను పాటించేలా చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిబంధనలను పదే పదే అతిక్రమించే వారిని గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు.
ఇకపై నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జరిమానాల విధానంలో పోలీసులు కీలక మార్పులు చేశారు. మొదటిసారి వన్ వే నిబంధనను ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధిస్తారు. అయితే, అదే తప్పును రెండోసారి పునరావృతం చేస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా సదరు వాహనాన్ని సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు.






