Thammineni Seetharam : మారువేషంలో వస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!

by Disha Web Desk 16 |
Thammineni Seetharam : మారువేషంలో వస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్ల కోసం ముసుగు వేసుకుని బీసీ ద్రోహులు మారువేషంలో వస్తున్నారని, తస్మాత్ జాగ్రత్త అని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైసీపీ ఆధ్వర్యంలో 'జయహో బీసీ మహాసభ'కు హాజరైన తమ్మినేని సీతారాం వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలకు దామాషా పద్ధతిలో రాజ్యాధికార ప్రసాదించిన గొప్ప నేత సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. కార్పొరేషన్ల నుంచి మంత్రి మండలి వరకు అన్నింట్లోనూ బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించారని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించి, సమాజంలో తలెత్తుకు జీవించేలా జగన్ చేశారన్నారు. చరిత్ర తెలియని వాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తామంటూ నాడు చంద్రబాబు బీసీలను అవహేళన చేశారని ఆరోపించారు.

'బీసీలు జడ్జిలుగా పనికిరారా?.. మేం పనికిరామని లేఖలు రాస్తారా.. మాకు తెలివితేటలు లేవా?.' అని సభా వేదికపై నుంచి చంద్రబాబును నిలదీశారు. కార్పొరేషన్లు, దేనికీ డైరెక్టర్ పదవులు నాలుక గీసుకోవడానికా? అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను సీతారం ఖండించారు. ఈ ఆర్డర్లు పేపర్లే కదా అని పొరపాటున నాలుక గీసుకుంటే నీ నాలుక పీలికలవుతుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో బీసీల కోసం రూ.90,415 కోట్లు ఖర్చు పెడితే గత ఐదేళ్లలో చంద్రబాబు కేవలం రూ.964 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే సార్వత్రిక కురుక్షేత్రానికి బీసీలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

బీసీలంతా ఐక్యంగా ఉండి వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం కుర్చీపై అధిరోహించేలా చేయాలని తమ్మినని సీతారాం పిలుపునిచ్చారు. శత్రుసంహారం చేసి జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో ఇదే బీసీలు చరిత్ర గతి తిరగరాస్తారని తమ్మినేని సీతారాం జోస్యం చెప్పారు.


Next Story

Most Viewed