మాజీ సీఎం వద్ద గోడు వెల్లబోసుకున్న భవానీపురం ఫ్లాట్స్ వాసులు

by Thanuru Gopichand |

తాజాగా విజయవాడ (Vijayawada) భవానీపురం ప్రాంతంలో 42 ఫ్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan) కలిశారు.

మాజీ సీఎం వద్ద గోడు వెల్లబోసుకున్న భవానీపురం ఫ్లాట్స్ వాసులు
X

దిశ, వెబ్ డెస్క్ : తాజాగా విజయవాడ (Vijayawada) భవానీపురం ప్రాంతంలో 42 ఫ్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan) కలిశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ పయనమవుతున్న జగన్‌ను కలిసిన బాధితులు, తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల రోడ్డున పడ్డ తమ గోడును కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, అండగా నిలబడాలని వారు జగన్‌ను వేడుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నివాసముంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా 'హైడ్రా' త‌ర‌హాలో కూల్చివేతలకు పాల్పడుతోందని, అక్రమంగా తమను వెళ్లగొడుతున్నారని బాధితులు వాపోయారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని, ప్రతి అడుగులోనూ తాను అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ హఠాత్తు పరిణామంతో ఎయిర్‌పోర్టు వద్ద కొంతసేపు సందడి వాతావరణం నెలకొంది.

​లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు

​కోర్టు తీర్పుతోనే భవానీపురం 42 ఫ్లాట్లను కూల్చివేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో, అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ 42 ఫ్లాట్లను కూల్చివేసినట్ల అధికారులు పేర్కొంటున్నారు. కూల్చివేతల సమయంలో బాధితులు తమ గుండెలను బాధుకున్నారు. సుమారు 25 ఏళ్లుగా నివాసముంటున్నామని చెబుతున్న బాధితులు, తమను వెళ్లగొట్టడాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. కూల్చివేతల సమయంలో పోలీసులకు, బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాము దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని మొరపెట్టుకున్నా అధికారులు కనికరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూల్చివేసిన ప్రాంతం చుట్టూ శ్రీలక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ నిర్మాణం చేపడుతోంది. దీంతో ఫ్లాట్లను కోల్పోయిన కుటుంబాలు నిరాశ్రయులై రోడ్డున పడ్డాయి. కోర్టు తీర్పు అమలు విషయంలో మానవత్వంతో వ్యవహరించలేదని, తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణమని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story