- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాన్ వెజ్ ప్రియులకు షాక్.. వారంరోజులు అమ్మకాలు బంద్
పట్టణంలో అతిసార వ్యాధి ప్రబలుతుండటంతో వారంరోజులపాటు నాన్ వెజ్ విక్రయాలు నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: నాన్ వెజ్ ప్రియులకు మున్సిపల్ కమిషనర్ షాకిచ్చారు. వారంరోజులు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. నందిగామ పట్టణంలోని చందాపురంలో గత కొన్ని రోజులుగా డయేరియా (అతిసార వ్యాధి) కేసులు పెరుగుతుండటంతో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ పరిధిలో వారం రోజుల పాటు అన్ని రకాల మాంసం విక్రయాలను నిషేధిస్తూ మున్సిపల్ కమిషనర్ జె. లోవరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారం మార్చి 31 నుండి ఏప్రిల్ 8 వరకు పట్టణంలో మాంసం విక్రయాలు నిలిచిపోనున్నాయి. చికెన్, మటన్, చేపల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లలో మాంసాహార వంటకాలను వండటం లేదా విక్రయించడం చేయరాదని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి మాంసం విక్రయాలు జరిపితే సదరు దుకాణాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. చందాపురం ప్రాంతంలో కలుషిత నీరు లేదా ఆహారం కారణంగా డయేరియా ప్రబలుతున్నట్లు అధికారులు గుర్తించారు. మాంసం విక్రయ కేంద్రాల వద్ద అపరిశుభ్రత వల్ల వ్యాధి మరింత విస్తరించే అవకాశం ఉందన్న ముందస్తు జాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. పట్టణంలో డయేరియా నియంత్రణకు మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖాధికారులు సూచించారు.






