మంచి చేస్తే ముళ్ళ పందితోనైనా కలుస్తా: Mp Kesineni Nani

by Vemula.Srinu Prasad |

మంచి చేస్తే ముళ్ళ పందితోనైనా కలుస్తా: Mp Kesineni Nani
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌పై ప్రశంసలు కురిపించడంపై ఎంపీ కేశినేని నాని వివరణ ఇచ్చారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళని అభినందిస్తానని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ నాలుగేళ్లుగా తనకు తెలుసునని..మంచి చేస్తున్నారు కాబట్టే ప్రశంసించానని తెలిపారు. తనకు తెలిసి మొండి తోక బ్రదర్స్ మంచి వాళ్ళని మరోసారి అభినందించారు. మంచి చేస్తే అభినందిస్తానని కానీ ఇసుకలో వాటాలు, మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే ధర్నాలు చేయడం.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడం తనకు చేతకాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఎవరు మంచి చేస్తే వాళ్ళతో కలిసి నడుస్తానని ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతానని గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని అలానే తాను కూడా బెజవాడ అభివృద్ధి కోసం ముళ్ళ పందితోనైనా కలుస్తానని ఎంపీ కేశినేని నాని చెప్పుకొచ్చారు. బాధ్యత కలిగిన ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు సహకారం తప్పనిసరి అని చెప్పారు. వైసీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఉదయభాను, జగన్మోహన్‌ సమన్వయం చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీగా ఉన్నా లేకపోయినా తనకు ఉన్న పరిచయాలతో బెజవాడ ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనకు ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్‌లో కూర్చొని విజయవాడ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. రాజకీయాల్లో తాను, తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తిని కాదని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.

Next Story