అర్ధరాత్రి భారీగా గంజాయి పట్టివేత.. పారిపోయే యత్నంలో స్మగ్లర్లకు ప్రమాదం

by Ramesh Naini |   (  Updated:2026-05-24 04:38:27  IST  )

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది.

అర్ధరాత్రి భారీగా గంజాయి పట్టివేత.. పారిపోయే యత్నంలో స్మగ్లర్లకు ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. అక్రమంగా తరలిస్తున్న 10.8 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన యువకులు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో చల్లపల్లి పోలీసులు అప్రమత్తమై తమ పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై గంజాయితో వస్తున్న ఇద్దరు యువకులు, ముందున్న పోలీసులను గమనించి కంగుతిన్నారు. వెంటనే పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, అతన్ని పట్టుకుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుల వద్ద నుంచి దాదాపు 10.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story