Diviseema Tragedy | వేలాది మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు

by Thanuru Gopichand |

దివిసీమలో (Diviseema) అర్థరాత్రి విరుచుకుపడిన ఉప్పెనతో వేలాది మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) గుర్తు చేసుకున్నారు.

Diviseema Tragedy | వేలాది మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు
X

దిశ, వెబ్ డెస్క్ : దివిసీమలో (Diviseema) అర్థరాత్రి విరుచుకుపడిన ఉప్పెనతో వేలాది మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) గుర్తు చేసుకున్నారు. అవనిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మంత్రి పాల్గొన్నారు. దివిసీమ ఉప్పెన (Storm) సమయంలో సుమారు 84 గ్రామాలు నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయాయన్నారు. ఎక్కడికక్కడ శవాల గుట్టలు పేరుకుపోయి ఉప్పెన ప్రభావానికి నిదర్శనంగా నిలిచాయన్నారు. దేవతలు తిరిగాడిన నేలగా పిలుచుకునే ప్రాంతం ఇంకా ఆ పాత గాయాలను నెమరు వేసుకుంటూనే ఉందని సానుభూతిని వ్యక్తపరిచారు. ఇప్పటికీ నాటి ఉప్పెనను తలచుకుంటే నాడు ఉప్పెన నుండి ప్రాణాలతో బయటపడిన వారు వణికిపోతున్నారని తెలిపారు. అంతటి విపత్తు సమయంలో మండలి వెంకట కృష్ణారావు (Mandali Venkata Krishna Rao) అందించిన సేవలను ఈ ప్రాంతం ఎప్పటికీ మరచిపోదన్నారు. రేయింబవళ్లు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. మండలి వెంకట కృష్ణారావు చొరవతోనే దివిసీమ ప్రాంతం మళ్లీ కోలుకుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story