ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ‘చల్లని’ ఊరట.. విజయవాడలో వాహనదారుల కోసం నీడనిచ్చే నెట్లు!

by Ramesh Naini |

విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో నగరంలోని ముఖ్యమైన జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ‘గ్రీన్ షేడ్ నెట్లు’ (నీడనిచ్చే వలలు) ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ‘చల్లని’ ఊరట.. విజయవాడలో వాహనదారుల కోసం నీడనిచ్చే నెట్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విజయవాడ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. నగరంలోని కీలకమైన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ పడిన ప్రతిసారీ ద్విచక్ర వాహనదారులు ఎండ వేడిమికి, ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో నగరవాసుల కష్టాలను గుర్తించిన అధికారులు.. వారికి కాస్త ఉపశమనం కలిగించేలా ఒక చక్కటి చర్యకు శ్రీకారం చుట్టారు. విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో నగరంలోని ముఖ్యమైన జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ‘గ్రీన్ షేడ్ నెట్లు’ (నీడనిచ్చే వలలు) ఏర్పాటు చేశారు.

తాజాగా బందరు రోడ్డులోని స్వరాజ్య మైదానం సమీపంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎండలో మాడిపోకుండా వాహనదారులు ఈ షేడ్ నెట్ల కింద సేదతీరుతున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ద్విచక్ర వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండువేసవిలో ఈ గ్రీన్ షేడ్ నెట్లు తమకు ఎంతో ఊరటనిస్తున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రధాన కూడళ్లలోనూ వీటిని త్వరితగతిన ఏర్పాటు చేయాలని నగర వాసులు కోరుతున్నారు.

Next Story