ఇంద్రకీలాద్రిపై గాజుల మహోత్సవం

by Thanuru Gopichand |

విజయవాడ కనకదుర్గమ్మను కోరి కొలువని భక్తులు లేరు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు భక్తుల మదిలో కొలువుదీరారు.

ఇంద్రకీలాద్రిపై గాజుల మహోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ కనకదుర్గమ్మను కోరి కొలువని భక్తులు లేరు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు భక్తుల మదిలో కొలువుదీరారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా అశేష భక్త జనాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తుంటారు బెజవాడ కనకదుర్గమ్మ (Bejawada Kanakadurgamma). అటువంటి చల్లని తల్లి కొలువుదీరిన ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గాజుల మహోత్సవం (Gajula Mahotsavam) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వివిధ రంగుల గాజులతో దేవస్థానం పరిసరాలు శోభాయమానంగా మారాయి. అమ్మవారితో పాటు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా దేవస్థాన వేద పండితులు నానా విధమైన గాజులతో అలంకారం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఈ గాజుల ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏడాది దీపావళి తరువాత కార్తీక మాసంలో (Karthika Masam) వచ్చే యమ ద్వితీయకు ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవం ముగిసిన తరువాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేస్తారు. కార్తీక మాసం నేపథ్యంలో అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి కూడా భక్తులు భక్తిశ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారు, స్వామివారు తమ చల్లని చూపులను తమపై ప్రసరించి ఆశీస్సులను అందించాలని వేడుకుంటున్నారు.

Next Story