Gudivada: సెల్ఫీ వీడియో తీసి ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

by Disha Web Desk 16 |
Gudivada: సెల్ఫీ వీడియో తీసి ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
X

దిశ,డైనమిక్ బ్యూరో: అప్పుల బాధ తాళలేక ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. చౌదరిపేటలో నివాసం ఉండే సాలా సుబ్రహ్మణ్యం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు.

అయితే కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశారు. తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి పెంచారు. అంతేకాదు వేధింపులకు సైతం పాల్పడినట్లు సుబ్రహ్మణ్యం సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. అప్పుల బాధలు తాళలేక...అప్పిచ్చిన వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పురుగుల మందు తాగేశారు. ఈ విషయం తెలుసుకున్న సహచర ఆటో డ్రైవర్లు ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాలా సుబ్రహ్మణ్యాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడ తరలించారు. కొడుకు ఆత్మహత్యాయత్నంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఈ సందర్భంగా అప్పిచ్చిన వ్యక్తికి, సుబ్రహ్మణ్యంకు జరిగిన సంభాషణల ఆడియో రికార్డులను కుటుంబ సభ్యులు మీడియాకు అందజేశారు.


Next Story