కృష్ణా జిల్లా : నెప్పల్లి సెంటరులో ఘోర రోడ్డు ప్రమాదం

by Thanuru Gopichand |

కృష్ణా జిల్లాలో (Krishna District) జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కృష్ణా జిల్లా : నెప్పల్లి సెంటరులో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలో (Krishna District) జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని కంకిపాడు మండలం నెప్పల్లి సెంటరులో (Neppalli Centre) చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ ద్విచక్రవానంపై ఇద్దరు ప్రయాణిస్తూ నెప్పల్లి సెంటరు వద్ద వాహనంపై రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోడ్డుకు మరోవైపు నుంచి వస్తున్న ఓ కారు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనానికి కారు బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా వాహనం కుదుపునకు గురైంది. వేగంగా ఢీకొన్న వైపు నుంచి ముందుకు కదిలింది. ఈ గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తి ముందుగా ఎగిరి రోడ్డు పక్కన పడ్డాడు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ముందు వైపునకు వెళ్లి పడ్డాడు. మొదటి వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే వాహనం అదే క్రమంలో రోడ్డు పక్కన నిలుచున్న మరో వ్యక్తిని కూడా బలంగా ఢీకొట్టడంతో అతను కూడా కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి, రోడ్డు పక్కన నిలుచున్న వ్యక్తి ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగంగా దెబ్బతినింది. అక్కడే ఉన్న స్థానికులు సత్వరమే స్పందించి సహాయాక చర్యలకు దిగారు. ఆంబులెన్సును సమాచారం అందించి క్షతగాత్రులకు ఆంబులెన్స్ వచ్చే వరకు సహాయం చేశారు. అనంతరం ఆంబులెన్సులో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన రికార్డైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే గత నవంబరు 29న కూడా కంకిపాడు మండలంలోని నెప్పల్లి వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కొమటిగుంటలకు చెందిన సందోలు నరసింహులు, ఉయ్యూరుకు చెందిన పచ్చిగళ్ళ దానియేలు బైక్‌పై కంకిపాడు వైపు వస్తున్నప్పుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో నెప్పల్లివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story