ఐటీఐ కాలేజీలో కత్తితో దాడి.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు

by Vemula.Srinu Prasad |

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఉన్న కొమ్మనబోయిన బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో శుక్రవారం జరిగిన కత్తి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ..

ఐటీఐ కాలేజీలో కత్తితో దాడి.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
X

దిశ, బాపట్ల ప్రతినిధి: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఉన్న కొమ్మనబోయిన బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో శుక్రవారం జరిగిన కత్తి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో షేక్ హుస్సేన్ (65) అనే వ్యక్తి మృతి చెందగా, కటకం శేషయ్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి షేక్ సత్తార్, ఆయన కొడుకు జిలాని పాల్పడినట్లు తెలుస్తోంది.

కాగా కళాశాలకు చెందిన భాగస్వాముల మధ్య గత 12 సంవత్సరాలుగా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లెక్కలు చెప్పాలని కోరుతూ వచ్చిన భాగస్వాములపై సత్తార్, ఆయన కుమారుడు జిలానితో కలిసి దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే దాడికి గల అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Next Story