- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప డిజిటల్ అరెస్ట్ కేసులో కీలక పరిణామం
సైబర్ క్రైమ్ మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫోన్ చేయండి.

దిశ, వెబ్ డెస్క్ : కడప జిల్లా బద్వేల్‌లో (Budwel) సంచలనం సృష్టించిన 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పోలీసుల వివరాల ప్రకారం బద్వేల్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ప్రసాద్‌ను లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేటుగాళ్లు బాధితుడికి ఫోన్ చేసి అతని పేరుపై అక్రమ నగదు లావాదేవీలు, మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. సీబీఐ, ముంబై పోలీసుల పేరుతో నకిలీ ఐడెంటిటీ కార్డులు చూపిస్తూ బాధితుడిని సుమారు మూడు నెలల పాటు 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఒకే గదిలో బంధీగా ఉంచారు. బయటకు వెళ్తే అరెస్ట్ చేస్తామని, పరువు పోతుందని బెదిరించి వివిధ విడతల్లో మొత్తం రూ. 72 లక్షల రూపాయలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే బాధితుడికి నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు, కోర్టు వారెంట్లను పంపి నమ్మించారు.
బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన కడప పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన తొమ్మిది మంది నిందితుల నుంచి రూ. 5 లక్షల నగదుతో పాటు, మోసాలకు ఉపయోగించిన పలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా పలువురిని ఇదే తరహాలో మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. చట్టంలో 'డిజిటల్ అరెస్ట్' అనే పద్ధతి లేదని, ఎవరైనా పోలీస్ లేదా సీబీఐ అధికారులమని ఫోన్ చేసి బెదిరిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. ఈ కేసు విచారణలో భాగంగా మరింత మంది నిందితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.






