- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతకు చెక్.. కొనుగోళ్లలో కీలక మార్పులు!
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులను ఎలాంటి కొరత లేకుండా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోలు, పంపిణీ వ్యవస్థలో సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది.

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులను ఎలాంటి కొరత లేకుండా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొనుగోలు, పంపిణీ వ్యవస్థలో సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది. గతంలో కొన్ని మందులను అవసరానికి మించి కొనడం, అవసరమైనవి అందుబాటులో లేకపోవడం, గడువు ముగిసిన మందులు నిల్వల్లో ఉండిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. మందుల కొనుగోలు, నిల్వ, పంపిణీ, వినియోగంపై సమగ్ర అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
వృథాను అరికట్టేలా కార్యాచరణ
ఈ కమిటీ ఆసుపత్రుల్లోని ఓపీ, ఐపీ సంఖ్యలు, వ్యాధుల తీవ్రత, కాలానుగుణ వ్యాధుల ఆధారంగా మందుల కొనుగోళ్లు చేపట్టేలా కార్యాచరణ రూపొందించనుంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. దీనివల్ల నిధుల వృథాను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
డిజిటల్ పర్యవేక్షణ..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల నిల్వలు, వినియోగం, గడువు తేదీలను డిజిటల్ విధానంలో పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ఏ ఆసుపత్రిలో ఏ మందు ఎంత అవసరమో ముందుగానే అంచనా వేసి సరఫరా చేసేలా సాంకేతికతను వినియోగించనున్నారు. జిల్లాల మధ్య అవసరానికి అనుగుణంగా మందులను పరస్పరం బదిలీ చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కొనుగోలు చేసే ప్రతి మందు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
పరికరాల కొనుగోలుకు క్యాలెండర్
ఆసుపత్రుల నుంచి వచ్చే వైద్య పరికరాలు, యంత్రాల కొనుగోలు ప్రతిపాదనలు నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం జరిగేలా ప్రత్యేక క్యాలెండర్ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. దీనివల్ల టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా మారడంతో పాటు పోటీ పెరిగి వ్యయభారం తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. రోగులకు బయట నుంచి మందులు కొనే భారం తగ్గించి, ఆసుపత్రుల్లోనే ఉచితంగా అందించడమే ఈ మార్పుల ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.






