కడప | చెరువులోకి దూసుకెళ్లిన కారు

by Thanuru Gopichand |

కడప జిల్లాలో (YSR Kadapa District) అనుకోని ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

కడప | చెరువులోకి దూసుకెళ్లిన కారు
X

దిశ, వెబ్ డెస్క్ : కడప జిల్లాలో (YSR Kadapa District) అనుకోని ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం శ్రావణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు కర్నూలులోని నిర్మలనగర్ లో నివాసం ఉంటున్నారు. వారాంతం నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి శనివారం వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం తెల్లవారుజామున కర్నూలుకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారి కారు ప్రమాదానికి గురైంది. ఒంటిమిట్ట సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి కారు చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డుపై నుంచి నేరుగా ఒంటిమిట్ట చెరువులోకి (Ontimitta Cheruvu) కారు దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా కారులో ఉన్న శ్రావణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

2022లోనూ ప్రమాదం..

ఫిబ్రవరి 2022 సంవత్సరంలో కూడా ఒంటిమిట్ట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా చంద్రగుప్త, మహంకాళి అనే ఇద్దరు మృతి చెందారని అప్పట్లో పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన కేదార్ మహంకాళికి రాహు కేతు పూజ చేయించడానికి సిద్ధాంతి చంద్రగుప్తతో కాళహస్తికి బయలుదేరారు. మార్గమధ్యలో కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరాముని దర్శించుకున్నారు. అనంతరం కాళహస్తికి ప్రయాణమయ్యారు. ఒంటిమిట్ట నుంచి బయలుదేరిన ఐదు నిమిషాల్లోనే కారు ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఆ నలుగురు వ్యక్తులు బయటికి రావడానికి ప్రయత్నించారు. అందులో డ్రైవర్‌తో పాటు కేదార్ మహంకాళి తమ్ముడు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు జలసమాధి అయ్యారు. పూజ చేయించుకోవడానికి వెళ్తున్న కేదార్ మహంకాళితో పాటు ఆయనతో పూజ చేయించడానికి వెళ్తున్న సిద్ధాంతి కూడా మృతి చెందాడు. క్రేన్ సహాయంతో చెరువులోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు.

Next Story