KA Paul Filed Case On Chandrababu Naidu: చంద్రబాబును అరెస్ట్ చేయాలి: కేఏ పాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-29 10:11:58  IST  )

కందుకూరు తొక్కిసలాట ఘటనలో 8 మంది మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు....

KA Paul Filed Case On Chandrababu Naidu: చంద్రబాబును అరెస్ట్ చేయాలి: కేఏ పాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కందుకూరు తొక్కిసలాట ఘటనలో 8 మంది మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. 2 వేల మంది పట్టే ప్రాంతంలో 50 వేల మందితో ఎలా సభ నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. 8 మంది ప్రాణాలను బలితీసుకున్నందుకు చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేయాలని కేఏ పాల్ కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడుపై 304ఏ, సెక్షన్ 174ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఓటుకు వేలు ఇవ్వడం చనిపోతే లక్షలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయిందన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో 50వేల మందితో సభలు నిర్వహిస్తారని కేఏ పాల్ ప్రశ్నించారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి.. 40 ఏళ్లు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలాంటి ఇరుకు ప్రాంతంలో సభ పెట్టకూడదని తెలియదా అని కేఏ పాల్ నిలదీశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కేఏ పాల్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఉద్యోగం, చదువుకునే వారికి ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు.

Next Story