నకిలీ మద్యం కేసు నిందితులకు జోగి రమేశ్ సహకారం!

by Thanuru Gopichand |

నకిలీ మద్యం కేసు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. నిందితుల వేళ్లన్ని వైసీపీ నేత జోగి రమేశ్ (Jogi Ramesh) వైపే చూపిస్తున్నాయి.

నకిలీ మద్యం కేసు నిందితులకు జోగి రమేశ్ సహకారం!
X

దిశ, వెబ్ డెస్క్ : నకిలీ మద్యం కేసు రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. నిందితుల వేళ్లన్ని వైసీపీ నేత జోగి రమేశ్ (Jogi Ramesh) వైపే చూపిస్తున్నాయి. నకిలీ మద్యం కేసు కీలక నిందితులకు జోగి రమేష్ సహకారం ఉందని నిందితుల విచారణలో వెల్లడవుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితుల్ని ఎక్సైజ్ అధికారులు (Excise Officers) కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు వారి యూపీఐ లావాదేవీలపై దృష్టిపెట్టారు. ఈ దందా ఎప్పటి నుంచి ప్రారంభించారు. నకిలీ మద్యం ఎక్కడెక్కడ విక్రయించారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

జోగి రమేశ్ సహకారంతోనే..

వైసీపీ నేత జోగి రమేశ్ సహకారంతోనే జనార్దన్ రావు (Janardhan Rao) నకిలీ మద్యం తయారీ ప్రారంభించారని కేసులో మరో కీలక నిందితుడు రవి ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడించారు. నకిలీ మద్యం (Fake liquor) కేసులో ఏడుగురు నిందితులను మూడో రోజు కస్టడీలోకి తీసుకొని ఎక్సైజ్ అధికారులు విచారించారు. విచారణలో పలు విషయాలను రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో ఏ4 రవి, ఏ7 బాదల్దాస్, ఏ8 ప్రదీప్ దాస్, ఏ1 శ్రీనివాస్ రెడ్డి, ఏ12 కల్యాణ్, ఏ15 రమేశ్ బాబు, ఏ 16 అల్లాబక్ష్ లను ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఇంకో రెండు రోజులపాటు వారి విచారణ కొనసాగనుంది.

రెండు రకాల బాటిళ్లు

విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో నిందితులను అధికారులు విచారించారు. నకిలీ మద్యం బాటిళ్లు తయారు చేసేందుకు ఏ2 జగన్మోహన్ రావు అధిక ధర ఇస్తానంటే అందుకు తాను ఒప్పుకున్నట్లు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒప్పందంలో భాగంగా రెండు రకాల నకిలీ మద్యం బాటిళ్లు తయారు చేసినట్లు వెల్లడించారు. సరుకు అందిన తరువాత లెక్క చూసి నగదు ఇచ్చేవాడని పేర్కొన్నారు. కేసులో కీలక నిందితుడు జనార్దన రావు తన వద్ద వైసీపీ నేత జోగి రమేశ్ గురించి పలుమార్లు ప్రస్తావించినట్లు నిందితుడు రవి విచారణలో వెల్లడించారు.

నకిలీ లేబుల్లు తయారీ

కేరళ మాల్డ్ విస్కీ, బెంగళూరు బ్రాందీలకు చెందిన నకిలీ లేబుల్లు తయారు చేసినట్లు రవి కస్టడీ విచారణలో తెలిపినట్లు సమాచారం. రవి ఖాతా నుంచి ఏ1, ఏ2లకు లావాదేవీలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. యూపీఐ బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వీటి ద్వారా కీలక సమాచారం వెలుగులోకి వస్తుందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. రెట్టింపు వేతనం ఇస్తానని ఏ1 జనార్దన రావు ఆశ చూపితేనే నకిలీ మద్యం విక్రయించామని నిందితులు బాదల్దాస్, ప్రదీప్ దాస్ విచారణలో తెలిపారు. ఒడిస్సాకు చెందిన ఈ ఇద్దరు నిందతులు రెండేళ్లుగా ఏఎన్ బార్ లో పని చేస్తున్నారు. రద్దీ సమయాల్లో నకిలీ మద్యాన్ని బార్లో విక్రయించాలని జనార్దన్ రావు చెప్పాడని బాదల్దాస్, ప్రదీప్ దాస్ వెల్లడించారు.

లెటర్ ఇచ్చినందుకే

నకిలీ లేబుళ్లు తయారు చేసేందుకు లెటర్ కూడా తెచ్చారని నిందితుడు అల్లా బక్ష్ తెలిపాడు. లెటర్ ఇచ్చినందు వల్లే తాను లేబుళ్లు డిజైన్ చేశానని విచారణలో వెల్లడించాడు. ఏడుగురు నిందితులను వేరువేరుగా విచారించిన ఎక్సైజ్ అధికారులు విచారణ అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి విజయవాడ జైళ్లో అప్పగించారు.

Next Story