అధిష్టానానికి తలనొప్పిగా మారి ‘జంగా’.. త్వరలో టీడీపీలోకి జంప్!

by Disha Web Desk 1 |
అధిష్టానానికి తలనొప్పిగా మారి ‘జంగా’.. త్వరలో టీడీపీలోకి జంప్!
X

దిశ ప్రతినిధి, గుంటూరు: జంగా కృష్ణమూర్తి.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ.. రేపో మాపో పసుపు కండువా కప్పుకొని మళ్లీ ఎమ్మెల్యే కావాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు జంగా కృష్ణమూర్తి పేరుకే ఎమ్మెల్సీ. గురజాల నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలకు పిలవరు, అక్కడి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిలవరు... కలుపుకుని పోరు.. ఎవరైనా పార్టీ నాయకులు జంగాను కలిస్తే.. ఆ నాయకుడి తోక కట్. అయినా జంగా కిమ్మనకుండా అన్నీ భరిస్తూ మౌనంగా తిరుగుతున్నారు. కాసు మహేష్ రెడ్డికి, జంగాకు మాటలు కూడా లేవ్. అయితే జంగా ఏడాది నుంచి నియోజక వర్గంలో బీసీ సంఘాల సమావేశాలు జరుపుకుంటూ వస్తున్నారు. ఐతే జంగా కృష్ణమూర్తి బలం కూడకట్టుకుంటున్నారనేది ఎవరూ గ్రహించ లేదు.

అందరి దృష్టీ గురజాలపైనే..

ప్రస్తుతం గురజాల ఎమ్మెల్యే పదవి కనక మహాలక్ష్మి దత్తపుత్రుడుగా మారింది. పదవితో పాటు రూ.కోట్ల ఆదాయం చేకూరుతుంది. అధికారం, డబ్బు కూడటంతో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా జంగాను లెక్కలో వేసుకోలేదని ఆ ఏముందిలే అనే చులకన భావంతో వ్యహరించారని ఆయన అనుచరులు బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో జంగా గురజాల వైసీపీ టికెట్ ఆశించారు. అధిష్టానం పెద్దగా పట్టించు కోకుండా మహేష్ వైపే మొగ్గు చూపింది.. జంగా టికెట్ రేస్‌ను ఉధృతం చేశారు.

అప్పుడు అధిష్టానం మహేష్‌కు, జంగా‌కు రాజీ పెట్టాలని ప్రయత్నించింది. అయినా జంగా వెనక్కు తగ్గలేదు. గురజాల నుంచి పోటీ చేస్తాను.. సీఎంకు అదే చెప్పండంటూ పార్టీ పెద్దలకు చెప్పి వచ్చేశారు. ఇంతలో నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలుకు నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయక పోవటంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. జంగా ఆయనకు సన్నిహితుడు. పైగా రాయలు స్థానంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా జంగా సామాజిక వర్గానికికే చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్‌ను ప్రకటించింది.

టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం..

దీంతో జంగా కృష్ణమూర్తి తన సామాజిక వర్గ నేతలతో వ్యూహం రచించి చక్రం తిప్పారు. వ్యూహం ఫలించింది. ప్రస్తుతం గురజాల టీడీపీ టికెట్ జంగాను వరించే పరిస్థితి వచ్చింది. నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన జాబితాలో గురజాలకు అభ్యర్థిని ప్రకటించ లేదు. జిల్లాలో సీనియర్ అయిన ఇన్‌చా‌ర్జి యరపతినేని శ్రీనివాసరావు పేరు ప్రకటించక పోవటంతో గురజాల రాజకీయ వర్గాలు కంగుతిన్నాయి. పల్నాడు జిల్లాలో జరిగే బాబు, పవన్ భారీ సభలో శ్రీ కృష్ణదేవరాయలుతో పాటు జంగా టీడీపీలో చేరనున్నారు. ఆ తరువాత జంగా గురజాలకు, యరపతినేనిని నరసరావుపేట టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించేందుకు అధినేత చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

వైసీపీలో అలజడి..

జంగా కృష్ణమూర్తి టీడీపీ అభ్యర్థి కానున్నారని నియోజకవర్గం అంతా ప్రచారం జరిగింది. దీంతో గురజాల వైసీపీలో కలవరం మొదలైంది. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో తెలియని పరిస్థితి. బీసీ వర్గాలలో కదలిక, చర్చలు సాగుతున్నాయి. మైనారిటీ వర్గీయులు కూడా జంగాతో చేతులు కలిపేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. గ్రామాల్లోని వైసీపీలో కూడా గుంభనంగా చర్చ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు జంగాను లెక్కలో వేసుకోని వైసీపీ నాయకులకు మైండ్ బ్లాంక్ అయింది.

గురజాల రాజకీయ పరిణామాలు ఎలా తిరుగుతాయనే ఆందోళనలో కొందరు వైసీపీ నాయకులు ఉన్నట్టు సమాచారం. జంగా చేతిలో అభాసుపాలు అవుతామేమో అన్న ఆందోళనతో ఇప్పటి వరకు అక్కడి అక్రమా లతో సంబంధం ఉన్న కొందరు ప్రముఖులు తట్టా బుట్టా సర్దుకుని బయటకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆ ఆయనదేముందిలే అని జంగా కృష్ణమూర్తిని లెక్కలో వేసుకోని గురజాల వైసీపీ నాయకులకు జంగా ప్రస్తుతం ఏకుమేకుగా మారారు.

Also Read..

పెండింగ్ సెగ్మెంట్లపై నేతల ఆశలు.. ఆ ఐదు నియోజకవర్గాల్లో ఉత్కంఠ


Next Story