ఇండ్ల నాగేశ్వరమ్మకు జనసేనాని ఆత్మీయ పలకరింపు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-24 05:56:08  IST  )

గతంలో ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గుంటూరు జిల్లాలోని, తాడేపల్లి మండలంలో ఉన్న ఇప్పటంలో (Ippatam) పర్యటించారు.

ఇండ్ల నాగేశ్వరమ్మకు జనసేనాని ఆత్మీయ పలకరింపు
X

దిశ, వెబ్ డెస్క్ : గతంలో ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గుంటూరు జిల్లాలోని, తాడేపల్లి మండలంలో ఉన్న ఇప్పటంలో (Ippatam) పర్యటించారు. జన సైనికుల జయజయధ్వానాలు, అభిమానుల నినాదాల మధ్య ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి చేరుకున్నారు. జనసేనానికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వృద్ధురాలైన నాగేశ్వరమ్మను సొంత బిడ్డలాగా ఆత్మీయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. నాగేశ్వరమ్మతో పాటు ఇప్పటంవాసులకు తాను అండగా ఉన్నాననే ధైర్యం ఇచ్చారు. డిప్యూటీ సీఎం స్వయంగా తమ వద్దకే వచ్చి మాట్లాడడంతో నివాసితులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ భావాలను మాటల్లో వ్యక్తపరచలేకపోయారు.

అయితే గత వైసీపీ పాలనలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహరీలను తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో వారి ఇండ్లను కూల్చివేశారు. ఆ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. మళ్లీ వస్తానని ఇండ్ల నాగేశ్వరమ్మకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం ఇప్పటం చేరుకుని వారిని పలకరించారు.

'' నాన్న నువ్వు ఐదు సార్లు సీఎం కావాలి.. నేను చూడాలి ''

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ.. నాన్న నువ్వు ఐదుసార్లు సీఎం కావాలి.. అది నేను చూడాలని నాగేశ్వరమ్మ కోరింది. ఆమె అభిమానంతో కోరిన కోరిక పట్ల డిప్యూటీ సీఎం చిన్న చిరు నవ్వుతో సమాధానం ఇచ్చారు. ఆమె మాటతో అక్కడున్న జనసైనికులు ఆనందానికి లోనయ్యారు.

మనవడి చదువుకు ప్రతి నెలా ఐదు వేల రూపాయల సాయం

నాగేశ్వరమ్మకు యాభై వేలు, దివ్యాంగుడైన ఆమె మనవడికి చికిత్స నిమిత్తం లక్ష రూపాయలను డిప్యూటీ సీఎం ఆర్థిక సాయంగా అందజేశారు. అంతేకాకుండా మానవతా సాయంగా మనవడి చదువుకు తన జీతం నుంచి ప్రతి నెలా ఐదు వేల రూపాయలను అందజేస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు.

Next Story