- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"సర్" పై రాజకీయ పార్టీల ఫోకస్..!
రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి.

దిశ, కామారెడ్డి: రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం పై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. తమ పార్టీకి అనుకూల ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగేలా చూసుకునేందుకు ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రత్యేక కసరత్తు ప్రారంభించాయి.
ఇంటింటికీ కార్యకర్తలు, బూత్ స్థాయి నిఘా..
పార్టీల వార్డు అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను దగ్గరుండి నింపించి, అవసరమైన ధృవీకరణ పత్రాలను సేకరించి బీఎల్‌ఓలకు అందజేస్తున్నారు. మండల స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అప్రమత్తం చేస్తున్నారు. పేరు తొలగిపోకుండా చూసుకోవడం, చిరునామా మార్పులు, కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి పేర్ల నమోదు పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. "ప్రతి ఓటు కీలకం" అంటూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
క్షేత్ర స్థాయి కేడర్‌కు కీలక బాధ్యతలు..
ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే SIR ప్రక్రియలో పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. క్షేత్ర స్థాయి కేడర్‌కు ఇదే కీలక బాధ్యతగా అప్పగించారు. తమ ఓటు బ్యాంకు బలపడేలా చూసుకోవడంతో పాటు, ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఉన్న అనర్హుల పేర్లపై అభ్యంతరాలు దాఖలు చేస్తున్నారు. ప్రతి బూత్‌కు ఇన్‌చార్జ్‌లను నియమించి, రోజువారీ నివేదికలు తీసుకుంటున్నారు. ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయం చేయడం, అధికారులతో సమన్వయం చేసుకోవడంలో కార్యకర్తలు బిజీగా ఉన్నారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకే పరిశీలన..
జిల్లాలో కొనసాగుతున్న SIR కార్యక్రమంలో రాజకీయ పార్టీల నుంచి అందుతున్న అభ్యర్థనలు, అభ్యంతరాలను అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే పరిశీలిస్తున్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అనర్హుల పేర్లను మాత్రమే జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
డిజిటల్ ట్రాకింగ్‌తో పార్టీల వ్యూహాలు..
పార్టీలు ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నాయి. ప్రతి బూత్‌లోని ఓటర్ల జాబితాను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి, కార్యకర్తల ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. డూప్లికేట్ పేర్లు, మృతుల పేర్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల పేర్లు ఉన్నాయా అనే అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు.
ఓటర్లలో అవగాహన పెంచే ప్రయత్నం..
SIR ప్రక్రియపై ఓటర్లలో అవగాహన పెంచేందుకు పార్టీలు ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. గ్రామ సభలు, రచ్చబండ సమావేశాల్లో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునేలా సహాయం అందిస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నప్పటికీ, అధికారులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కాగా పారదర్శకంగా జాబితా తయారీ జరిగితేనే స్వేచ్ఛాయుత ఎన్నికలకు అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.






