Jallikattu : చిత్తూరు జిల్లా రంగంపేటలో ప్రారంభమైన జల్లికట్టు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-15 09:33:11  IST  )

చిత్తూరు జిల్లా రంగంపేట(Rangampet)లో జల్లికట్టు(Jallikattu) పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున జల్లికట్టు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జల్లికట్టు కోసం సిద్ధం చేసిన కోడెద్దు(Bulls)లు గ్రామ వీధుల్లో రంకెలు వేస్తున్నాయి.

Jallikattu : చిత్తూరు జిల్లా రంగంపేటలో ప్రారంభమైన జల్లికట్టు
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా రంగంపేట(Rangampet)లో పౌరుషాల పట్టు.. జల్లికట్టు(Jallikattu) పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున జల్లికట్టు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జల్లికట్టు కోసం సిద్ధం చేసిన కోడెద్దు(Bulls)లు గ్రామ వీధుల్లో రంకెలు వేస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి, పీలేరు నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి జల్లికట్టును తిలకిస్తున్నారు.

జల్లికట్టు పోటీలలో పశువులకు ప్రత్యేకంగా అమర్చిన బహుమతి పలకలతో కూడిన పౌరుషాల కోడె ఎద్దులను రంగంపేటలోని వీధులలో వదిలిపెట్టగా..వాటికి ఎదురెళ్లి వాటిని లొంగ తీసుకుని వాటికి కట్టి ఉన్న పలకల బహుమతులను తమ సొంతం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో యువకులు(Young people) పోటీలు పడ్డారు. ఎవరైతే ఎద్దులను లొంగదీసుకుని వాటికి కట్టిన పలకలను సొంతం చేసుకుంటారో వారే జల్లికట్టు పోటీలలో విజేతలుగా నిలుస్తారు.

తమకు నచ్చిన సినిమా హీరోల, రాజకీయ పార్టీ నాయకుల బొమ్మలను పలక మీద అలంకరించి నగదు, బంగారు, వెండి వంటి విలువైన బహుమతులను మూట కట్టి జల్లికట్టులో వదిలేస్తారు. విలువైన ఈ పలకల బహుమతులను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఈ బహుమతులను గెలుచుకునేందుకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమ ప్రాంతాలలో కోడి పందాలు నిర్వహిస్తే, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జల్లికట్టు నిర్వహిస్తారు. కోడిగిత్తల రంకెలు.. హుషారెత్తే యువకులతో పల్లెలలో సంక్రాంతి సంబరాలు జల్లికట్టుతో కొనసాగుతాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సాహస క్రీడ అనాదిగా కొనసాగుతోంది. తమిళనాడు తరహాలోనే ఈ ప్రాంతంలో కూడా జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ప్రమాదకరమైన ఈ జల్లికట్టును అడ్డుకోవడం కోసం పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, దశాబ్దాలుగా సాంప్రదాయ క్రీడగా జల్లికట్టు కొనసాగుతూనే ఉంది. ఈ జల్లికట్టు పోటీలలో అనేకమంది గాయాల పాలవుతున్నా ఆట మాత్రం ఆగడం లేదు. ఒక్కొక్కసారి కొనదేరిన కొమ్మలతో ఉండే ఎద్దులను లొంగ తీసుకోవడం ప్రాణాల మీదకు తెస్తుంది. ఒక్కోసారి తీవ్ర గాయాలు పాలై లేవలేని పరిస్థితికి చేరుకుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు. అందుకే ఈ జల్లికట్టు పోటీలను నిర్వహించినప్పుడు గాయపడిన వారికి వెంటనే ప్రధమ చికిత్స చేయడానికి కూడా వైద్య బృందాన్ని సిద్ధం చేసుకుంటారు.

ఈ జల్లికట్టు పోటీలకు భార్య మౌనికతో కలిసి మంచు మనోజ్ హాజరవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Next Story