అసెంబ్లీకి వస్తానంటున్న జగన్.. వ్యూహం అదేనా?

by Thanuru Gopichand |

అసెంబ్లీకి జగన్ వస్తారా రారా..? కొన్ని నెలలుగా రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజలు, ఆయన అభిమానుల్లో సైతం వినిపిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది.

అసెంబ్లీకి వస్తానంటున్న జగన్.. వ్యూహం అదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీకి జగన్ వస్తారా రారా..? కొన్ని నెలలుగా రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజలు, ఆయన అభిమానుల్లో సైతం వినిపిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావడం ఖరారైంది. అయితే ఇప్పుడు ఆయన సమావేశాలకు ఎందుకు వస్తున్నాడు.. అనేదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. భయపడి వస్తున్నాడా, లేక బాధ్యతతో వస్తున్నాడా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. తమ నాయకుడు ప్రశ్నించడానికి అసెంబ్లీకి వస్తున్నాడని ఈరోజు ఉదయం ఒంగోలులో ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు అయితే శాసనసభలో తనకు ఉన్న మిగిలిన 10 మంది సభ్యులతో కలిసి ఆయన ఏం ప్రశ్నిస్తారు.. వారికి ప్రశ్నించే సమయం ఉంటుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అయితే అసెంబ్లీ తొలి సమావేశానికి వైయస్ జగన్ హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం అయన అసెంబ్లీకి హాజరు కాలేదు. మిగిలిన సభ్యులు కూడా అసెంబ్లీకి రాలేదు. తమకు బలం ఉండడంతో శాసనమండలికి మాత్రం వైసీపీ సభ్యులు వచ్చారు. తనకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఆయన అసెంబ్లీ స్పీకర్​కు లేఖ రాశారు. అటు నుంచి స్పందన రాకపోవడంతో.. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. అయితే జగన్ తాడేపల్లి వేదికగా అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లు పెడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఆ సందర్భంలో తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటూ కూడా అడుగుతున్నారు. నిబంధనల ప్రకారం ఇవ్వడం కుదరదు అంటూ తెలుగుదేశం వాదిస్తోంది.

అయితే వరుసగా ఆరు నెలల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటుపడుతుందంటూ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన ప్రకటన చేశారు. సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే రాజకీయ వర్గాల్లో కొంత చర్చ నడిచింది. గతంలో చంద్రబాబు కూడా అంసెంబ్లీకి వరుసగా హాజరు కాలేదు కదా అని వైసీపీ ప్రశ్నించింది. ఈ క్రమంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జగన్ అసెంబ్లీకి వెళ్తున్నారని ఆ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈరోజు ఉదయం ప్రకటించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయనను అవమానిస్తున్నారని అన్నారు. ఎవరికో భయపడో అసెంబ్లీకి ఆయన వెళ్లడం లేదన్నారు.

ఏ వ్యూహంతో అసెంబ్లీ కి జగన్ వస్తున్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆయన వెనుక కేవలం 11 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారమే సమయాన్ని కేటాయిస్తామని గతంలోనూ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ఈ సమయాన్ని జగన్ వినియోగించుకుంటారా? లేక ఆందోళనలతో హడావుడి చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్లకార్డులు, బ్యానర్లు, ధర్నాలు, ప్రదర్శనలు నిషేదించారు. దీంతో ఏం జరుగుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Next Story