Christmas: జగన్, చంద్రబాబు, పవన్, లోకేశ్ ఏమన్నారంటే..!

by Disha Web Desk 16 |
Christmas: జగన్, చంద్రబాబు, పవన్, లోకేశ్ ఏమన్నారంటే..!
X

సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం

- సీఎం జగన్

దిశ, ఏపీ బ్యూరో: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశమన్నారు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం, దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ బాటలు వేశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ ఆ కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.

మనిషి శ్రేయస్సు అసలైన క్రైస్తవం

- చంద్రబాబు

సమాజంలో శాంతి కోసం పాటుపడటం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవమని చంద్రబాబు తెలిపారు. క్రీస్తు రాజ్యంలో సేవ తప్ప మరి దేనికీ చోటు లేదన్నారు. క్రీస్తు జన్మదినం సర్వ మానవాళికి పవిత్ర దినమని చెప్పారు. శాంతి శకానికి ఆరంభ దినమని, ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు

- నారా లోకేష్

ప్రపంచ‌శ్రేయ‌స్సుని కాంక్షించే ద‌యామ‌యుడు ఏసుక్రీస్తు జ‌న్మదిన‌మైన క్రిస్మస్ సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నానన్నారు. ప్రేమ‌ను పంచిన శాంతిదూత ఉప‌దేశం మాన‌వాళి ఆచ‌రించ‌ద‌గిన నిత్యనూత‌న సందేశమని పేర్కొన్నారు. క్రిస్మస్ పండ‌గ‌ని ఆనందంగా జ‌రుపుకోవాల‌ని లోకేష్ కోరుకున్నారు.

ఏసుక్రీస్తు పలుకులు ఆచరణీయం

- పవన్ కళ్యాణ్

లోకభాందవుడిగా కీర్తిగాంచిన ఏసుక్రీస్తు అవతరించిన పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న కైస్తవ సోదర సోదరీమణులకు పవన్ కల్యాణ్ ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పశువులపాకలో జన్మించి గొర్రల కాపరిగా ప్రపంచానికి త్యాగం చేశారని చెప్పారు. శాంతి, ప్రేమ సందేశాలను అచరణాత్మకంగా అందించిన ఆ ప్రభువు పలుకులు సర్యదా అచరణీయమని పవన్ తెలిపారు.


Next Story

Most Viewed