విగ్రహాల ధ్వంసం.. భూ కుంభకోణం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, భూ కుంభకోణాల వెనుక.. వైసీపీ మాస్టర్ మైండ్ జగన్ ప్లాన్ ఉందని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

విగ్రహాల ధ్వంసం.. భూ కుంభకోణం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, భూ కుంభకోణాల వెనుక.. వైసీపీ మాస్టర్ మైండ్ జగన్ ప్లాన్ ఉందని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. రెండ్రోజుల క్రితం నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కాగా.. టీడీపీ నేతలపైనే బురదజల్లేందుకు వైసీపీ సిద్ధమైందని, కానీ ఆ వ్యక్తి వైసీపీకి చెందిన కార్యకర్తేనని తేలడంతో మిన్నకుండిపోయారన్నారు. కావాలనే వైసీపీ నేతలే విగ్రహాన్ని ధ్వంసం చేయించి.. అలజడులు సృష్టించేందుకు ప్లాన్ చేశారని విమర్శించారు. కులాలు, వర్గాల మధ్య గొడవలు సృష్టించి.. వాటి నుంచి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ ప్రధాన ఉద్దేశ్యమని, రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడలేకపోతున్నారని దుయ్యబట్టారు.

మరోవైపు వినుకొండలో అక్రమాలపై కూడా జీవీ ఆంజనేయులు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు దొంగ జీఓలను సృష్టించి.. రూ.1500 కోట్ల విలువైన ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్రపన్నారని తెలిపారు. చేసిన దొంగపనిని కూడా ఒరిజినల్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. ఆ దొంగపనికి డబ్బు సమకూర్చింది కూడా బ్రహ్మనాయుడేనని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలో రెండు ఎకరాల భూమిని సైతం వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. ఇందులో వైఎస్ జగన్ కు, మోహన్ రెడ్డికి కూడా వాటాలున్నాయని, వారిద్దరూ ఎంత వాటా పుచ్చుకున్నారో వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలెవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వెంటనే బహిష్కరిస్తామని, వైసీపీలో మాత్రం అవినీతికే పెద్దపీట వేస్తారని తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే జగన్ విగ్రహాల ధ్వంసం, భూకబ్జాలకు పాల్పడుతూ.. ఆ నేరాలను టీడీపీ నేతలపై మోపి విషప్రచారం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు.

Next Story