మీది వృత్తి కాదు.. సామాజిక బాధ్యత

by Thanuru Gopichand |

సమాజానికి ధైర్యమిచ్చే వారు పోలీసులు, ప్రజలకు న్యాయం చేసే వారు న్యాయవాదులు అని హోమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

మీది వృత్తి కాదు.. సామాజిక బాధ్యత
X

దిశ, డైనమిక్​ బ్యూరో: సమాజానికి ధైర్యమిచ్చే వారు పోలీసులు, ప్రజలకు న్యాయం చేసే వారు న్యాయవాదులు అని హోమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మీది వృత్తి కాదు.. సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. విజయవాడ జీఆర్టీ హోటల్ వేదికగా ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో న్యాయవిచారణలో కీలకమైన డిజిటల్ ఎవిడెన్స్ పాత్రపై అనిత మాట్లాడారు. ఎంతటివారైనా కోర్టుకు వస్తే చేతులు కట్టుకుని నిల్చునేంతటి గౌరవం న్యాయ వ్యవస్థకుందన్నారు. ఆధారాలిచ్చేది పోలీసులు.. శిక్షపడేలా చేయాల్సింది న్యాయమూర్తులు, న్యాయవాదులే అని గుర్తు చేశారు. న్యాయవాదులందరినీ ఒక చోట చేర్చి ఇలాంటి మంచి సదస్సు నిర్వహించడం సంతోషకరం అన్నారు. న్యాయవ్యవస్థల్లో మహిళలు ఎక్కువ ఉండడం శుభపరిణామం అని పేర్కొన్నారు. న్యాయవిచారణ వేగంగా పూర్తి చేసేందుకు ఇవాళ తొలి అడుగు పడిందన్నారు. పోలీస్, లాయర్ వృత్తిలోకి రావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయ్, దొంగలు ఇప్పుడు చాలా తెలివిమీరి పోయారు, నేరస్థులను పట్టుకోవడానికి మనం చాలా అప్ గ్రేడ్ అవ్వాలని సూచించారు. టెక్నాలజీ ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలన్నారు. ఆన్ లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కలిగించడం చాలా ముఖ్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారని అన్నారు. పోలీస్, న్యాయ వ్యవస్థల సమన్వయంతో చాలా కేసులు చేధించ వచ్చున్నన్నారు. ఛార్జ్ షీట్, ఎఫ్ఐఆర్ నమోదైన నాటి నుంచి లీగల్ వ్యవస్థ సహకరించాలని సూచించారు.

ఉయ్యాల్లో ఉన్న పసిపాపల మీద కూడా అత్యాచారాలు జరుగుతుండడం చాలా దిగ్భ్రాంతికరం అని అనిత ఆవేదన చెందారు. నేరస్థుడు దొరికినా చట్టప్రకారమే శిక్షించాల్సి రావడం వల్ల కేసు పూర్తయ్యేదాకా ప్రతి విషయం కీలకమే అని తెలిపారు. విజయనగరం జిల్లాలో రెండు కేసుల్లో నిందితులకు 6నెలలోపే శిక్ష వేయించామన్నారు. న్యాయవ్యవస్థకు అవసరమైన వనరులు, వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దొంగతనాలు , నేరాల నియంత్రణకోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అన్నారు. ప్రోటోకాల్ లేకుండా ట్రాఫిక్ లో ప్రయాణించి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశా అని తెలిపారు.ఫాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టులు, పోస్కో కోర్టులు ఎన్నో ఉన్నాయి.. తొందరగా న్యాయం చేయడమే అసలైన న్యాయం అని అనిత పేర్కొన్నారు. బాధితులకు అండగా నిలవడానికి మనమందరం ఏకమవుదాం అని పిలుపునిచ్చారు.

Next Story