ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చీమ కుట్టినట్టు లేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలి, హక్కులను కాపాడే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఏ కోశాన లేదని మాజీ సీఎం జగన్ సంచలన వాఖ్యలు చేశారు.

ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చీమ కుట్టినట్టు లేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలి, హక్కులను కాపాడే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఏ కోశాన లేదని మాజీ సీఎం జగన్ సంచలన వాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. పొరుగు రాష్ట్రంలో కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడానికి కేబినెట్ ఆమోదం తెలిపి చకాచకా అడుగులేస్తుంటే చంద్రబాబుకు కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి ఎందుకని జగన్ ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని జగన్ ఆరోపించారు. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌నులు, స్పిల్‌వే స‌హా, గేట్ల నిర్మాణ ప‌నులు జ‌రుగుతుంటే అప్పట్లో చంద్రబాబు చోద్యం చూశారని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆల్మట్టి హైట్ 519 మీటర్లకు పరిమితమైందన్న విషయం వాస్తవం కాదా అని జగన్ ప్రశ్నించారు.

ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు ఎత్తు పెంచి నీటిని నిల్వ చేయ‌డానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైందని వైఎస్ జగన్ అన్నారు. నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, అందుకు రానున్న 3 ఏళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించిందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబులో కదలిక కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మీరు కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి ఎందుకు తేలేకపోతున్నారో చెప్పాలన్నారు.

మరోవైపు జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌ (KWDT-2) ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయని జగన్ కామెంట్ చేశారు. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేసిన KWDT-2 తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణలోకి తీసుకున్న పరిస్థితుల్లో, దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించని విధంగా నష్టం జరుగుతుందన్నారు. కరువు వస్తే రాష్ట్రమే భరించాలి, ఎలాగూ దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చినా రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం 2023 అక్టోబరులోనే పిటిషన్‌ దాఖలు చేసి న్యాయ పోరాటాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు నేడు సమర్ధవంతంగా వాదనలు వినిపించి, రాష్ట్ర హక్కులను కాపాడ్డంలో చిత్తశుద్ధి చూపడం లేదని జగన్ ఆరోపించారు.

సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ఇప్పటికైనా మేలుకొని కేంద్రంలో ఎంపీల సంఖ్య పరంగా బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు KWDT-2 విచారణపై దృష్టి పెట్టి సమర్ధవంతమైన వాదనలు వినిపించాలన్నారు. లేకపోతే భావితరాల మనసుల్లోచంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని జగన్ కామెంట్ చేశారు.

Next Story