అది కాంట్రాక్టర్ల జేబులు నింపే పథకం : వైఎస్ షర్మిల

by Thanuru Gopichand |

మన్రేగాను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కొత్తగా విబి గ్రామ్ జి (VB G-RAM G) అనే చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు.

అది కాంట్రాక్టర్ల జేబులు నింపే పథకం : వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి చేపట్టిన (YS Sharmila Reddy) 'మన్రేగా పరిరక్షణ యాత్ర' మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని (Dharmavaram Constituency) రాఘవంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారు. కూలీలతో కలిసి పలుగు, పార పట్టి మట్టి ఎత్తి పని చేశారు. అనంతరం స్థానిక కూలీలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని, దీనిపై ప్రజలు గళమెత్తాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Raja Shekar Reddy) హయాంలో పేదల ఆకలి తీర్చడానికి 'కరువు పని'గా ఈ పథకం మొదైలందన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అద్భుతంగా అమలు జరిగిందని గుర్తు చేశారు. అయితే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి గ్రహణం పట్టిందని ధ్వజమెత్తారు. మన్రేగాను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కొత్తగా విబి గ్రామ్ జి (VB G-RAM G) అనే చట్టాన్ని తీసుకువచ్చారని ఆమె విమర్శించారు. ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం పడుతుందని, ఇది పేదల పొట్ట కొట్టే చర్య అని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్న 125 రోజుల పని అనేది ఒక పచ్చి మోసం అని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 100 రోజుల పనిని ఒక హక్కుగా కల్పించాం. కానీ బీజేపీ హయాంలో సగటున 52 రోజులు కూడా పని ఇవ్వలేకపోయారు. 100 రోజులే సరిగ్గా ఇవ్వలేని వారు, ఇప్పుడు 125 రోజులు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అని ఆమె ఎద్దేవా చేశారు. మన్రేగా కింద రోజుకు 7 గంటలు పని చేస్తే సరిపోయేదని, కానీ కొత్త చట్టం ప్రకారం 125 రోజుల పేరుతో 12 గంటలు పని చేయించుకోవాలని చూస్తున్నారని, ఇది కూలీలను శ్రమదోపిడీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పథకంలో గ్రామసభల ద్వారా పనులు నిర్ణయించే ప్రజాస్వామ్య పద్ధతిని తీసేశారన్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి కేంద్రమే నిర్ణయించేలా మార్పులు తెచ్చారని ఆమె ఆరోపించారు. ఏ గ్రామంలో ఏ పని కావాలో కేంద్రానికి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇదంతా బీజేపీకి అనుకూలమైన కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనని విమర్శించారు. కూలీలకు ఉపాధి కల్పించే పథకాన్ని కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై చేసే ఏజెన్సీగా మార్చేశారని దుయ్యబట్టారు. గతంలో వైఎస్సార్ హయాంలో పని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించేవారని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు ఉండేవని, ఇప్పుడు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు.

రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో సుమారు 50 లక్షల జాబ్ కార్డులను తొలగించడం దారుణమని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కోటి 10 లక్షల కార్డులు ఉండేవన్నారు. నేడు వాటిని 65 లక్షలకు కుదించారని ఆమె పేర్కొన్నారు. రామ్ జి చట్టం అమలులోకి వస్తే మళ్లీ గ్రామాల్లో వలసలు, ఆకలి చావులు పెరుగుతాయని ఆమె హెచ్చరించారు. పేదలకు అండగా ఉండాల్సిన 'మన్రేగా'ను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పరిరక్షణ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని షర్మిలా రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story