- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
liquor scam: లిక్కర్ స్కామ్‌లో రంగంలోకి ఐటీ.. రూ. వేల కోట్ల అక్రమ సంపాదనపై గురి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో ఉచ్చు బిగుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌పై తాజాగా ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మర విచారణ జరుపుతుండగా, ఇప్పుడు ఐటీ శాఖ కూడా రంగంలోకి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రూ. 2 వేల కోట్ల ట్యాక్స్‌పై ఆరా!
ఈ కుంభకోణం ద్వారా సుమారు రూ. 2 వేల కోట్ల మేర అక్రమ సంపాదన చేతులు మారినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ భారీ మొత్తానికి సంబంధించిన పన్ను చెల్లింపుల వ్యవహారంపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఏపీ మద్యం స్కామ్‌కు చెందిన కీలక రికార్డులను, ఆర్థిక లావాదేవీల పత్రాలను ఐటీ శాఖకు బదిలీ చేశారు. ఈ పత్రాల ఆధారంగా పన్ను ఎగవేత ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో ఐటీ అధికారులు లోతుగా విశ్లేషిస్తున్నారు.
త్వరలో నోటీసులు.. ఆపై కేసు నమోదు
మద్యం స్కామ్‌లో భాగస్వాములై, అక్రమంగా లబ్ధి పొందిన పలువురు నిందితులకు త్వరలోనే నోటీసులు జారీ చేయడానికి ఆదాయ పన్ను శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ జరిగితే, వెంటనే ఐటీ శాఖ అధికారికంగా కేసు నమోదు చేయనుంది. కేసు నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే పూర్తిస్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కుల భరతం పట్టేందుకు ఐటీ అధికారులు సిద్ధమవుతున్నారు. రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు (ఈడీ, ఐటీ) ఏకకాలంలో దర్యాప్తును వేగవంతం చేయడంతో ఈ కేసులో మున్ముందు ఇంకెన్ని సంచలనాలు వెలుగుచూస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.






