రెంటికీ చెడ్డ రేవడేనా?.. మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ భవితవ్యం ప్రశ్నార్థకం

by Kema Shiva Kumar |

జనసేన విశాఖ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించారు.

రెంటికీ చెడ్డ రేవడేనా?.. మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ భవితవ్యం ప్రశ్నార్థకం
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన విశాఖ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించారు. పార్టీ ఫిరాయించిన కారణంగా ఆయనను పదవి నుంచి తప్పిస్తూ అనర్హత వేటు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ శాననమండలి చైర్మన్ కె.మోషేన్ రాజు మంగళవారం ప్రకటించారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్ నేత రామచంద్రయ్యను కూడా అనర్హుడిగా ప్రకటించారు. రెండు పర్యాయాలు నోటీసులు ఇచ్చిన తరువాత సంతృప్తికరమైన సమాధానం వీరి నుంచి రాలేదన్న కారణంగా పార్టీ ఫిరాయింపు నిబంధనల కింద అనర్హత వేటు వేశారు. అయితే, మొదటి నుంచి వంశీ పై జనసేనలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైసీపీ కోవర్ట్‌గా జనసేలోకి వచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. జనసేనలో ఎమ్మెల్యే టికెట్ కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌లో తనకున్న పలుకుబడితో ఉద్దేశపూర్వకంగానే అనర్హత వేటు వేయించుకొన్నారనే ప్రచారం కూడా ప్రారంభమైంది.

వంశీ భవిష్యత్తు ప్రశ్నార్థకం

గతంలో రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యక్ష ఎన్నికలలో కార్పొరేటర్‌గానే విజయం సాధించారు. కార్పొరేటర్‌గా విజయం సాధించినప్పటికీ విశాఖ మేయర్‌గా ఆయనను ఎంపిక చేయకపోవడంతో పార్టీపై కినుక వహించారు. చివరికి సామాజిక సమీకరణల నేపథ్యంలో ఎమ్మెల్సీగా వైఎస్సార్ కాంగ్రెస్ అవకాశం కల్పించింది. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీ నెల క్రితం జనసేనలోకి మారారు. శాసనసభ్యుడిగా పోటీ చేయాలనే సంకల్పంతో పార్టీ మారినట్లు ప్రకటించారు. అయితే జనసేన నగర అధ్యక్షుడు హోదాలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో, ప్రెస్ మీట్‌లలో ముఖ్యమంత్రి జగన్, సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు చాలా మంచి వారని అదే పనిగా పొగడడం కూడా అనుమానాలను పెంచింది.

టికెట్ దక్కేనా?

అయితే వంశీ గతంలో రెండు పర్యాయాలు పోటీ చేసిన విశాఖ తూర్పు నియోజక వర్గం నుంచి వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించిన సిట్టింగ్ తెలుగుదేశం శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబుకే ఆ పార్టీ కేటాయించింది. దీంతో వంశీ విశాఖ దక్షిణ సీటుపై కన్నేశారు. ఆ నియోజక వర్గంలో వంశీకి విజయావకాశాలు అంతగా లేదనే నివేదికలు రావడంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచే వచ్చిన బ్రాహ్మణ నేత సీతంరాజు సుధాకర్ పేరును కూటమి అభ్యర్థిగా విశాఖ దక్షిణకు పరిశీలిస్తున్నారు. సుధాకర్ చేతుల్లో ఐదుగురు కార్పొరేటర్లు వుండడం, నియోజక వర్గంలో ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలు చేయడం ఆయనకు అనుకూలాంశంగా మారింది. గతంలో ఆ నియోజక వర్గం నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికే చెందిన ద్రోణంరాజ సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్‌లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.

Next Story