‘వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా?’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు.

‘వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా?’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాజాగా మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) సంచలన ట్వీట్ చేశారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస మద్దతు ధర లభించక, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడు పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు, మంత్రులు, యంత్రాంగం కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా? అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.

మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదని తెలిపారు. చొరవ చూపాల్సిన కూటమి ప్రభుత్వం మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించడమే కాకుండా.. డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదెక్కడి న్యాయం? చంద్రబాబు(CM Chandrababu) అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు?

మిర్చి విషయంలో కూడా రైతులను మోసం చేశారని విమర్శించారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చు చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామన్నారు.

ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం(AP Government) కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇప్పటికీ రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళన చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనాభాలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు.

Next Story