- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ నడుస్తోంది : ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టబడుల పండుగ నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పెట్టబడుల పండుగ నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కనిగిరి (Kanigiri) నియోజకవర్గంలోని పెదఈర్లపాడులోని ఎంఎస్ఎంఈ పార్కును ఆయన మంగళవారం ప్రారంభించారు. అక్కడి నుంచి వర్చువల్ గా రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు (MSME Parks) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.25,256 కోట్ల పెట్టుబడులతో 25 పరిశ్రమలను వర్చువల్ గా ముఖ్యమంత్రి ఆరంభించారు. పారిశ్రామిక వేత్తలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంభాషించిన సీఎం చంద్రబాబు చెత్త నుంచి సంపద సృష్టించడమే ఇప్పుడు కొత్త విధానం అన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు (Compressed Bio Gas Plant) దీనిని అందిపుచ్చుకోవటం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోని రైతులకూ ప్రయోజనం కలిగిస్తుందన్నారు.
కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారులు, కామన్ ఇన్ఫ్రాను క్రియేట్ చేస్తున్నామన్నారు. ఆలోచనతో వస్తే చాలు పారిశ్రామిక యూనిట్ పెట్టొచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కులు, పారిశ్రామిక యూనిట్లకు (Industrial Units) ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకుంటున్నాం అన్నారు.
మొంథా తుఫాన్ సమయంలో
మొంథా తుఫాన్ (Montha Cyclone) సమయంలో అంతా కలిసి పనిచేశాం.. ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వటం కాదు.. పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్నామని ప్రకటించారు. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో 17 నెలల క్రితం పాలనా పగ్గాలు చేపట్టామన్నారు. ఏపీ బ్రాండ్ ను (Brand AP) పునరుద్ధరిస్తామని చెప్పామని పేర్కొన్నారు. చెప్పినట్లుగా చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
ఆ నిధులు ఉండి ఉంటే
గత ప్రభుత్వం పీపీఏలు రద్దు చేసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. దానివల్ల కరెంటు వాడుకోకుండానే రూ.9 వేల కోట్లు ప్రజాధనం (Public Money) చెల్లించారని వెల్లడించారు. ఆ నిధులే ఉండిఉంటే అనేక ప్రాజెక్టులు కట్టుకునేవాళ్లమని తెలియజేశారు. అన్ని విధాలుగా గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు.
గతంలో ఛలో ఛలో.. ఇప్పుడు భలే భలే
గత ప్రభుత్వంలో ఛలోఛలో అని పారిశ్రామిక వేత్తలు వెళ్లిపోతే.. ఇప్పుడు భలేభలే అంటూ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నారన్నారు. విశాఖకు లక్ష కోట్ల పెట్టుబడితో గూగుల్ కంపెనీ (Google) వస్తోందన్నారు. ఇదీ కూటమి ప్రభుత్వంపై కంపెనీలకు ఉన్న విశ్వాసమన్నారు. కేంద్రం ఏ పాలసీ తీసుకువచ్చినా వాటిని మొదట అమలు చేస్తోంది ఏపీనే అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఏది మొదలు పెట్టినా ఏపీలో తక్షణం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తున్నారన్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మంత్రి లోకేష్ (Minister Lokesh) పనిచేస్తున్నారని ప్రకటించారు.
జనవరి నాటికి మరో 70 పార్కులు
50 ఎంఎస్ఎంఈ పార్కుల్లో 15 ప్రారంభోత్సవాలు, 35కి శంకుస్థాపన చేశామన్నారు. జనవరి నాటికి మరో 70 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి ప్రతీ కుటుంబంలోనూ ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తను తయారుచేస్తామన్నారు. నేడు 99 కంపెనీల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామన్నారు. వీటి ద్వారా రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రకటించారు. 25 సంస్థలు ఉత్పాదక దశకు వచ్చాయని, వాటిని ప్రారంభించుంటుకున్నామని చెప్పారు.
అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్
భవిష్యత్ అంతా టెక్నాలజీదేనని, క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) జనవరికి అమరావతిలో ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లను మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించేలా పరిస్థితి మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని ఇంటి నుంచే తయారు చేసుకునేలా ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రిలయన్స్ బయో ఫ్యూయెల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందని.. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నామని తెలియజేశారు. డ్రోన్ సిటీని ఓర్వకల్లు లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ లో వాడిన డ్రోన్లను కూడా ఇక్కడే టెస్ట్ చేశారని ముఖ్యమంత్రి తెలిపారు.






