మ్యాంగో బే క్లబ్ కేసులో విచారణ వేగవంతం

by Thanuru Gopichand |

ఏలూరు జిల్లాలోని అగిరిపల్లి మండలం, పోతవరప్పాడులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు.

మ్యాంగో బే క్లబ్ కేసులో విచారణ వేగవంతం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లాలోని అగిరిపల్లి మండలం, పోతవరప్పాడులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. 'మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ' (Mango Bay Club)పేరుతో నిర్వహిస్తున్న ఈ క్లబ్‌లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను రట్టు చేస్తూ పోలీసులు భారీ స్థాయిలో రికవరీ చేపట్టారు. ఈ కేసులో విచారణ వేగవంతం కావడంతో నిందితులను ఏలూరు కోర్టులో (Eluru Court) హాజరుపరచనున్నారు.

​హైకోర్టు ఉత్తర్వుల ముసుగులో అక్రమ దందా

మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కొన్ని పాత ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పేకాట స్థావరం నడుపుతున్నట్లు తెలుస్తోంది. తాము నిర్వహిస్తున్నది కేవలం రిక్రియేషన్ క్లబ్ మాత్రమేనని వారు బుకాయిస్తున్నారు. క్లబ్ బయట హైకోర్టు ఆర్డర్ కాపీలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి పోలీసుల కళ్లు కప్పే ప్రయత్నం చేశారు. అయితే రిక్రియేషన్ పేరుతో ఇక్కడ లక్షల రూపాయల చేతులు మారుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

​భారీగా పట్టుబడిన నగదు

ఆదివారం జరిగిన సోదాల్లో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. సుమారు రూ. 32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. క్లబ్‌లో పేకాట ఆడుతున్న 281 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు చెందిన 130 కార్లు, 40కి పైగా బైకులను పోలీసులు సీజ్ చేశారు.

రోజుకు రూ. 20 లక్షల కలెక్షన్!

​ఈ క్లబ్‌ను కాట్రగడ్డ అశోక్, చేవూరి లక్ష్మణ్, అప్పారావులు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ​మొత్తం క్లబ్‌ను 5 జోన్లుగా విభజించి దందా కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ​రోజుకు దాదాపు రూ. 20 లక్షల వరకు కలెక్షన్లు వస్తున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ​రూ. 10 వేలు, 20 వేలు, 30 వేల రూపాయల ఎంట్రీ ఫీజులతో పూల్ గేమ్స్ నిర్వహించేవారని పోలీసులు చెబుతున్నారు.

తెలంగాణ నుంచి కూడా

​తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో పేకాట ఆడేవారు కార్లలో ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. ​పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న వారికి నిర్వాహకులు అక్కడికక్కడే అప్పులు కూడా ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ​గత మూడు నెలలుగా ఈ క్లబ్ ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతోంది. ప్రధాన నిందితులు కాట్రగడ్డ అశోక్, లక్ష్మణ్, అప్పారావులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, నేడు వారిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు.

Next Story