- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు : పోలీసు కమీషనర్ సమీక్ష
భారత తూర్పు నావికాదళం అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లను నిర్వహించనుంది.

దిశ, వెబ్ డెస్క్: సాగర నగరం విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు భారత తూర్పు నావికాదళం అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మెగా ఈవెంట్లను నిర్వహించనుంది. 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR)', 'మిలాన్-2026', 'ఐయాన్స్-కాన్ క్లెవ్ అఫ్ చీఫ్స్' (IONS) కార్యక్రమాలు నగరం గర్వించదగ్గ రీతిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ లో పోలీసు కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ముందస్తు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నేవీ ఉన్నతాధికారులతో పాటు డిసిపి-01, ఏడిసిపిలు, ఏసిపిలు పాల్గొన్నారు. ఈ భారీ ఈవెంట్ల నిర్వహణకు అవసరమైన భద్రతా ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా విశాఖ నగరం మరోసారి ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందనుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోలీసు బందోబస్తు, పటిష్టమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు, పార్కింగ్ జోన్లు, భద్రతా దృష్ట్యా 'నో-డ్రోన్ జోన్'లను ప్రకటించడంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ దేశాల నుంచి విచ్చేసే ప్రతినిధులు, విశిష్ట అతిధుల రాకపోకలు, వారి సందర్శనల కోసం ప్రత్యేక రోడ్డు మార్గాలను కేటాయిస్తూ ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్య అతిథుల భద్రతలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నేవీ, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కమీషనర్ ఆదేశించారు. ప్రపంచ దేశాల నౌకాదళ అధిపతులు హాజరయ్యే ఈ వేడుకలను దిగ్విజయం చేసేందుకు పటిష్టమైన కార్యాచరణను అధికారులు రూపొందించారు.






