ChandraBabu Naidu,Lokesh లకు భద్రత పెంచండి

by Disha Web Desk |
ChandraBabu Naidu,Lokesh లకు భద్రత పెంచండి
X

దిశ, డైనమిక్ బ్యూరో : కొంతమంది వైసీపీ నాయకులు సంఘ వ్యతిరేకులతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లను టార్గెట్ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై అత్యంతనీచంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు అని లేఖలో ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ల భద్రతకు సంబంధించి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. 2019 ఆగస్టులో చంద్రబాబు నాయుడు నివాసంపై భద్రతా నిబంధనలకు వ్యతిరేకంగా డ్రోన్‌లు ఎగురవేశారు అని గుర్తు చేశారు. 2021 సెప్టెంబర్‌లో వైసీపీ ఎమ్మెల్యే అయిన జోగి రమేష్ టీడీపీ అధినేత ఇంటిపై దాడికి ప్రయత్నించాడు అని ఆరోపించారు. 2022 ఆగస్టులో కుప్పం పర్యటనలో వైసీపీ గూండాలు హింసాత్మక చర్యలకు పాల్పడి పర్యటనను అడ్డుకున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌ల ఆదేశాలతో వైసీపీ గూండాలు చంద్రబాబు నాయుడుపై దాడి చేసేందుకు ఆయనకు అత్యంత దగ్గరగా రాగలిగారు అని లేఖలో చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై దాడి చేసేందుకు కుట్రపూరితంగా కొందరు వైసీపీ నాయకుల సంఘ వ్యతిరేకులతో కుమ్మక్కయ్యారని స్పష్టమవుతోందని అన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి అని లేఖలో విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ల భద్రతా ఏర్పాట్లను ఏకకాలంలో సమీక్షించి తక్షణమే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి... లోకేశ్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ బృందాలను పెంచి ఫూల్ ప్రూఫ్ భద్రత కల్పించాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకే‌శ్‌లపై అత్యంత నీచంగా దుర్భాషలాడిన తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి విశృంఖలమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు.

ఇవి కూడా చదవండి : నన్ను, Lokeshను చంపేస్తారట.. ChandraBabu Naidu సంచలన వ్యాఖ్యలు


Next Story

Most Viewed