మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-16 10:02:11  IST  )

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళాలో ప్రయాగ్ రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ఈ రోజు(గురువారం) స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ(TTD) ఘనంగా నిర్వహించింది.

మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళాలో ప్రయాగ్ రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ఈ రోజు(గురువారం) స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ(TTD) ఘనంగా నిర్వహించింది. తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం స్థానిక భక్తులను భక్తి పారవశ్యానికి లోను చేసింది.

ఈ సందర్భంగా వేద పండితులు సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, మొదలైన పంచ సూక్తాలను అర్చకులు వల్లించారు. అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్ర ధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదనంతరం చక్రత్తాళ్వార్ ను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ చక్రత్తాళ్వార్‌కు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణ్ రెడ్డి, సూపరింటెండెంట్ గురు రాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story