భట్టి రంకెలు వేస్తే అంకెలు మారవు : మాజీమంత్రి హరీష్ రావు కౌంటర్

by Naga Rani Yarlagadda |

తమ హయాంలో చేసిన అప్పుల గురించి ఎన్నిసార్లు ప్రశ్నించినా ఒకే సమాధానం ఉంటుందని, తమ సమాధానం మారదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

భట్టి రంకెలు వేస్తే అంకెలు మారవు : మాజీమంత్రి హరీష్ రావు కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తమ హయాంలో చేసిన అప్పుల గురించి ఎన్నిసార్లు ప్రశ్నించినా ఒకే సమాధానం ఉంటుందని, తమ సమాధానం మారదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అప్పులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పేవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. అప్పులపై భట్టి విక్రమార్కకు కౌంటరిచ్చారు. అప్పుల గురించి ఆయన చెప్పినవన్నీ అసత్యాలేనని, లేని అప్పుల్ని ఉన్నట్లుగా చూపించారని ఆరోపించారు. భట్టి తీరు చూస్తుంటే డ్యామేజ్ కంట్రోల్ కోసమే మాట్లాడినట్లు కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు పూటకోమాట మాట్లాడుతున్నారని, ఏదైనా ఒక విషయంపై స్టాండ్ తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలిచ్చిందని, వాటిని అమలు చేయలేకనే అప్పులను సాకుగా చూపుతున్నారని ధ్వజమెత్తారు. అప్పులపై తాము ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకటే మాట చెబుతున్నామని పునరుద్ఘాటించారు. కార్పొరేషన్లు తీసుకునే అప్పులు మళ్లీ అవే చెల్లిస్తాయని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోనే తెలిపిందని గుర్తుచేశారు. అంకెల గారడీతో లేని అప్పులు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారని, భట్టి రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని కౌంటరిచ్చారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పును కూడా భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ హయాంలో చేసినట్లు చూపించారని, రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సింది రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కోపంతో ఊగిపోయినంత మాత్రాన లెక్కలు మారవన్నారు.

Next Story