మరో వివాదంలో విజయవాడ ఇంద్రకీలాద్రి.. భక్తుడిపై సిబ్బంది దాడి!

by Ramesh Naini |

విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో మరోసారి వివాదం చోటు చేసుకుంది.

మరో వివాదంలో విజయవాడ ఇంద్రకీలాద్రి.. భక్తుడిపై సిబ్బంది దాడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. కనకదుర్గానగర్ పార్కింగ్ వద్ద భక్తుడిపై దుర్గగుడి సెక్యూరిటీ, పార్కింగ్ సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. కారు పార్కింగ్ విషయంలో భక్తుడికి, సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది విచక్షణ కోల్పోయి భక్తుడిపై చేయి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తులతో మర్యాదగా, సహనంతో వ్యవహరించాల్సిన సిబ్బంది ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందిస్తున్న భక్తులు, నెటిజన్లు దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. వీడియో ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం, దేవస్థాన అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఇటీవల దుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించినట్లు వివాదం చోటు చేసుకుంది.

Next Story