ముఖ్యమంత్రైనా జగన్‌కు తప్పని తిప్పలు : దేశందాటాలంటే ఇక అంతేనా?

by Disha Web Desk 21 |
ముఖ్యమంత్రైనా జగన్‌కు తప్పని తిప్పలు : దేశందాటాలంటే ఇక అంతేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులలో అత్యంత ప్రజాదరణ కలిగిన వారిలో ఆయన ముందు వరుసలో నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా తాను తలచుకుంటే ఏదైనా చిటికెలో సాధ్యం చేసుకోవచ్చు. దేశంలో భారీబందోబస్తుతో ఎక్కడికైనా వెళ్లే ఆ ముఖ్యమంత్రికి విదేశాలకు మాత్రం స్వేచ్ఛగా వెళ్లే హక్కులేకుండా పోయింది. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ ఇతర కార్యక్రమాలకు అయినా ఆయన ఆమోదముద్ర తప్పనిసరి. కానీ ఈ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లాలంటే మాత్రం సీబీఐ కోర్టు ఆమోదం తప్పనిసరి పరిస్థితి. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఎదుర్కోంటున్నారు సదరు సీఎం. తాజాగా విదేశాలకు వెళ్లేందుకు సీబీఐను అనుమతి కోరారు. ఇంతకీ విదేశాలకు వెళ్లలేని ఆ సీఎం ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సదరు ముఖ్యమంత్రి ఎవరో తెలిసే ఉంటుంది కదూ. ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు ఎంత ముఖ్యమంత్రి అయినా కేసు ఉంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కుమార్తె వద్దకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనలకు సన్నద్ధమవుతున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకూ యూకే టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా లండన్‌లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు తాము విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. యూకే పర్యటనకు వెళ్లడం కోసం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించాలని జగన్ పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు కోసం సీబీఐ కొంత సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.

విజయసాయిరెడ్డి సైతం

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సైతం విదేశీ పర్యటనలకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాబోయే ఆరు నెలల్లో విదేశీ పర్యటనలు చేయాల్సి ఉందని సీబీఐ కోర్టుకి తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్శిటీలతో ఒప్పందాల మేరకు అమెరికా, యూకే, జర్మనీ, దుబాయ్, సింగపూర్‌లలో పర్యటించాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల నిమిత్తం ఆరు నెలల్లో 30 రోజుల పాటు తాను విదేశాల్లోనే పర్యటించాల్సి ఉందని ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. దీంతో ఈకేసు విచారణను సైతం ఈనెల 30కు వాయిదా వేసింది.

కోర్టు కండీషన్లు అడ్డంకి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఈ కేసులలో ఏ-2గా ఉన్నారు. దీంతో వీరిద్దరికీ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ కోర్టు పలు కండీషన్లు విధించింది. సీబీఐ కోర్టు అనుమతి తీసుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లరాదనే షరతు విధించింది. దీంతో ఎప్పుడు విదేశాలకు వెళ్లాలన్నా ఖచ్చితంగా అటు సీఎం వైఎస్ జగన్ ఇటు విజయసాయిరెడ్డిలు సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిలు గతంలో పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి విదేశాల్లో పర్యటించాలని ఇరువురు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి సీబీఐ అనుమతి ఇస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Next Story