- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్స్యకారుల పొట్టకొడుతున్న సీఆర్జెడ్ ఉల్లంఘనలు.. సముద్రపు అంచున సంక్షోభం
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ పల్లెపాలెం గ్రామ సముద్ర తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్తానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ...

దిశ, బాపట్ల ప్రతినిధి: కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ పల్లెపాలెం గ్రామ సముద్ర తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్తానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సముద్ర అలల గరిష్ఠ రేఖ (HTL) నుండి కేవలం 10 మీటర్ల దూరంలోనే “సిట్టింగ్ బెంచెస్” పేరుతో నిర్మాణాలు పూర్తి చేయడం సి.ఆర్.జెడ్ నిబంధనలకు నీళ్లోదలడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర అలల గరిష్ఠ రేఖ (HTL) నుండి 200 మీటర్ల పరిధిలోని నో డెవలప్మెంట్ జోన్ (NDZ)లో బోర్‌వెల్, సంప్‌లు, డ్రెస్సింగ్ రూములు, కమ్యూనిటీ టాయిలెట్లు వంటి నిర్మాణాలు చేపట్టడంపై మత్యకారుల ఫిర్యాదుతో మరింత వివాదాస్పదంగా మారింది.
ముఖ్యంగా పర్యావరణానికి అత్యంత సున్నితమైన సి.ఆర్.జెడ్ -1 కేటగిరీకి చెందిన ఇసుక దిన్నెలను ధ్వంసం చేసి నిర్మాణాలు చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ చర్యలు పర్యావరణ సంరక్షణ చట్టం, 1986 మరియు సి.ఆర్.జెడ్ నోటిఫికేషన్ – 2019 నిబంధనలకు విరుద్ధమని మత్స్యకారులు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నిర్మాణాలకు 15వ ఆర్థిక సంఘం టైడ్ గ్రాంట్ నిధులను దారిమళ్ళించి రూ.49.50 లక్షలు కేటాయించినట్లు వారు చెబుతున్నారు. పనులు పూర్తికాకుండానే పూర్తి అయినట్లు తప్పుడు నివేదికలు సమర్పించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. ఈ నిర్మాణాలు ప్రజలకు ఉపయోగపడకపోగా, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారే అవకాశం ఉందనీ వారు ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల జీవనాధారం, సముద్ర తీర జీవవ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ, అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఇసుక దిన్నెల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, స్వతంత్ర నిపుణుల కమిటీతో విచారణ జరిపించి, పర్యావరణ నష్టాన్ని అంచనా వేయించి, సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ వారు జిల్లా కలెక్టర్‌ను కోరారు.
మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో ...
ఈ వ్యవహారం అంతా మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో జరగడం స్తానికంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో ఎన్నికైన మండలాధ్యక్షుడు కూటమి ప్రభుత్వంలో కూడా అధికార యంత్రాంగాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అధికారులను కలుపుకుని అవినీతికి పాల్పడుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారనీ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు అందిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పంచాయితీరాజ్, రెవెన్యూ అధికారులతో సంయుక్త విచారణ జరిపి నివేదిక సమర్పించవలసినదిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.






