గొడ్డలితో కేక్ కట్ చేస్తే.. పోలీసులు పిలిచి గడ్డిపెట్టారు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-20 05:15:14  IST  )

యువకుల వ్యవహారంతో గ్రామస్తుల్లో ఆందోళన.

గొడ్డలితో కేక్ కట్ చేస్తే.. పోలీసులు పిలిచి గడ్డిపెట్టారు
X

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లాలో (Krishna District) కొందరు యువకుల అత్యుత్సాహం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మచిలీపట్నం (Machilipatnam) మండలం పెదపట్నం (Pedapatnam) గ్రామానికి చెందిన రాంకీ, సంతోష్, రాజేశ్ అనే ముగ్గురు యువకులు పుట్టినరోజు వేడుకల పేరుతో హద్దులు దాటారు. సాధారణంగా కత్తితో కోయాల్సిన కేకును (Cake Cutting), వీరు ఏకంగా గొడ్డలితో కట్ చేసి హల్ చల్ చేశారు. ఈ విపరీత ధోరణికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, స్థానికులు యువకుల ప్రవర్తనపై తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, కనుమ పండుగ రోజున కూడా ఈ యువకులు విచ్చలవిడిగా మద్యం సేవించి గ్రామంలో 'రప్పా.. రప్పా' తరహాలో వీరంగం సృష్టించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

​యువకుల ఆగడాలు మితిమీరిపోవడంతో, వారి తీరుపై విసిగిపోయిన పెదపట్నం గ్రామస్థులు చివరకు పోలీసులను (Police) ఆశ్రయించారు. గొడ్డలి వంటి ఆయుధాలతో బహిరంగంగా కేక్ కట్ చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్న యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి స్టేషన్‌కు పిలిపించారు. పోలీసులు తమదైన శైలిలో ఆ యువకులకు గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి, గడ్డిపెట్టినట్లు సమాచారం. సమాజంలో ఇటువంటి అసాంఘిక పనులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనతోనైనా యువతలో మార్పు వస్తుందని గ్రామస్తులు ఆశిస్తున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిపై నిఘా ఉంచామని పోలీసులు స్పష్టం చేశారు.

Next Story