- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానంతో భార్యలను కడతేర్చిన భర్తలు
అనుమానమే పెనుభూతమైంది. పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం (Anantapuram) జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు వేర్వేరు ప్రాంతాల్లో దారుణ హత్యలు (Crime) కలకలం రేపాయి. కుటుంబ కలహాలు, భార్యల ప్రవర్తనపై పెంచుకున్న అహేతుక అనుమానమే ఈ రెండు ఘటనల్లోనూ ప్రాణాలు తీయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పచ్చని సంసారాల్లో అనుమానం పెనుభూతంగా మారి ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ జంట హత్యల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎల్లమ్మ కాలనీలో గొంతుకోసి హత్య
పోలీసుల వివరాల ప్రకారంఅనంతపురం నగరంలోని ఎల్లమ్మ కాలనీలో వీర అనే వ్యక్తి తన భార్య గంగను అత్యంత దారుణంగా హత్య చేశాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన వీర తన భార్య గంగ గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
రాయవరంలో కత్తితో దాడి చేసి
మరో ఘటనలో జిల్లాలోని రాయవరంలో మారన్న అనే వ్యక్తి తన భార్య కుల్లాయమ్మ (43)ను కత్తితో నరికి చంపాడు. వీరిద్దరి మధ్య గొడవలు జరగడంతో నాలుగు రోజుల క్రితమే కుల్లాయమ్మ అనంతపురం నుంచి రాయదుర్గం సమీపంలోని తన పుట్టిల్లు రాయవరానికి వచ్చేసింది. అయితే నిన్న రాత్రి అక్కడికి చేరుకున్న భర్త మారన్న, తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో ఆమెపై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనుమానంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.






