విశాఖలో భార్యాభర్తల ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

విశాఖపట్నంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంచలనం రేపింది. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాటాకీస్ వెనుక ఉన్న శ్రీనగర్ ప్రాంతంలో ఓ అద్దె భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది..

విశాఖలో భార్యాభర్తల ఆత్మహత్య
X

దిశ, విశాఖపట్నం ప్రతినిధి: విశాఖపట్నంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంచలనం రేపింది. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాటాకీస్ వెనుక ఉన్న శ్రీనగర్ ప్రాంతంలో ఓ అద్దె భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మారడం అందరినీ కలచివేసింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ప్రాంతానికి చెందిన బలరాం (33), ప్రియాంక (27) ప్రేమ వివాహం చేసుకుని కొన్నేళ్లుగా విశాఖలో నివాసముంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబానికి ఆసరాగా ప్రియాంక తల్లి కూడా వారితో కలిసి అదే ఇంట్లో ఉంటోంది. బలరాం వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా అతడు మద్యానికి బానిస కావడంతో కుటుంబంలో తరచూ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం.

బలరాం మద్యం సేవించి తనను వేధిస్తున్నాడంటూ ప్రియాంక గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు కూడా వారిని మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలరాం తనకు బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి సమీపంలోని హోటల్‌కు వెళ్లినట్లు తెలిసింది. కొంతసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంట్లో విషాద దృశ్యం కనిపించింది. భార్యాభర్తలు ఇద్దరూ విగతజీవులుగా ఉండగా, పక్కనే నాలుగేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. ఈ దృశ్యం చూసిన ప్రియాంక తల్లి షాక్‌కు గురై గట్టిగా విలపించింది. ఆమె కేకలు విని అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ క్రైం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ప్రియాంకకు ముందుగా ఉరి వేసి, ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం బలరాం కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని ప్రశ్నిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర వ్యక్తిగత కారణాలు ఏమైనా ఈ విషాదానికి దారితీశాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తోంది. తన కుమార్తె, అల్లుడు ఇద్దరూ మృతిచెందడంతో ప్రియాంక తల్లి రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. చిన్నారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ ఘటనపై ద్వారకానగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Next Story