ఉద్యోగాల ఆశచూపి విదేశాలకు మానవ అక్రమ రవాణా : విశాఖ సీపీ బాగ్చి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-16 16:47:26  IST  )

విదేశాలకు మానవ అక్రమ రవాణా చేస్తున్న పలువురిని వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంబోడియా, మయన్మార్, థాయ్ లాండ్, లావోస్ వంటి..

ఉద్యోగాల ఆశచూపి విదేశాలకు మానవ అక్రమ రవాణా : విశాఖ సీపీ బాగ్చి
X

దిశ, వెబ్‌డెస్క్: విదేశాలకు మానవ అక్రమ రవాణా చేస్తున్న పలువురిని వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంబోడియా, మయన్మార్, థాయ్ లాండ్, లావోస్ వంటి సౌత్ ఆసియా దేశాలకు యువతీ యువకుల్ని తరలిస్తోన్న ముఠాలు, సైబర్ నేరాల కేంద్రాలపై వైజాగ్ సీపీ శంకబ్రత బాగ్చి ఉక్కుపాదం మోపారు. వారందరినీ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. 85 మంది బాధితుల్ని స్వదేశానికి రప్పించగలిగామని, 23 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

విదేశాల్లో డేటా ఎంట్రీ జాబ్, లక్షల్లో జీతం అని ఆశచూపించి, అట్రాక్టివ్ ప్రకటనలతో యువతను మోసం చేసి, నమ్మించి సైబర్ స్కామ్ కంపెనీల్లో నేరాలు చేసేందుకు తరలిస్తున్నారన్నారు. చైనాకు చెందిన కొన్ని స్కామ్ కంపెనీలు ఫేక్ ప్రొఫైల్ సృష్టించి సోషల్ మీడియాలో టార్గెటెడ్ వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, నమ్మిన వారి నుంచి పెట్టుబడులు, టాస్క్ గేమ్స్, డిజిటల్ అరెస్ట్, హనీట్రాప్, ఫిషింగ్ లింక్స్ పద్ధతుల్లో డబ్బులు కొట్టేస్తారని వివరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే వెళ్తుండగా.. మరికొందరు మాత్రం తెలియక ఈ ఉచ్చులో ఇరుక్కుంటున్నారన్నారు. జులై 14న నలుగురిని ఉద్యోగాల పేరుతో కాంబోడియాకు తరలించేందుకు ప్రయత్నించిన ఏజెంట్లు సురేశ్, ఆదిలక్ష్మి అలియాస్ అనుని వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద అరెస్ట్ చేశామని తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా రిక్రూట్మెంట్ ఏజెంట్లు, కన్సల్టెన్సీల పేరుతో మోసం చేస్తే ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ బాగ్చి హెచ్చరించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉంటే 7995095799కు లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story