- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ టూ చెన్నై.. భారీ గోవుల అక్రమ రవాణా గుట్టురట్టు.. ఆళ్లగడ్డలో 400 గోవులు సేఫ్!
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ హైవేపై అర్ధరాత్రి వేళ భారీ గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ హైవేపై అర్ధరాత్రి వేళ భారీ గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. తెలంగాణ నుంచి చెన్నైకి అత్యంత పకడ్బందీగా గోవులను తరలిస్తున్నట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు. ఒక పక్కా పథకం ప్రకారం, సినిమా ఫక్కీలో కంటైనర్ల ద్వారా 400 ఆవులను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
సినీ ఫక్కీలో ఎస్కాట్ వాహనాలు
లారీల్లో ఆవులను తరలించడమే కాకుండా, పోలీసుల కళ్లు గప్పేందుకు ఈ ముఠా హైటెక్ పద్ధతులను ఎంచుకుంది. ఆరు భారీ కంటైనర్లలో ఆవులను కుక్కి, ఆ వాహనాలకు ముందు వెనుక ‘పైలట్’ వాహనాలుగా ఇన్నోవా కార్లను ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని బట్టి దీని వెనుక పెద్ద ముఠానే ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
రంగంలోకి ఎమ్మెల్యే.. అడ్డుకున్న వైనం
ఈ అక్రమ రవాణా విషయం తెలియగానే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అప్రమత్తమయ్యారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆళ్లగడ్డ వద్ద వాహనలను చుట్టుముట్టి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు వచ్చి ట్రక్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ రాకెట్ వెనుక ఉన్న అసలైన సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే పట్టుబడిన 400 గోవులను పశుసంవర్ధక శాఖ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఆవులన్నీ ఆరోగ్యంగానే ఉన్నట్లు వారు నిర్ధారించారు. అనంతరం ఆవులను తాత్కాలిక సంరక్షణ కోసం నందికొట్కూరు గోశాలకు తరలించారు.






