SAVE PUNARVIKA: పాప ప్రాణం కోసం కదిలిన సోషల్ మీడియా.. వైద్యం కోసం ఎన్నికోట్లు వచ్చాయంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-24 08:35:00  IST  )

ఓ పాప ప్రాణాన్ని నిలబెట్టేందుకు సోషల్ మీడియా మొత్తం కదిలింది. #SavePunarvika పేరుతో వేలల్లో పోస్టులు కనిపిస్తున్నాయి.

SAVE PUNARVIKA: పాప ప్రాణం కోసం కదిలిన సోషల్ మీడియా.. వైద్యం కోసం ఎన్నికోట్లు వచ్చాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వల్ల చెడుతో పాటు మంచి కూడా జరుగుతుందని మరోసారి రుజువైంది. ఓ పాప ప్రాణాన్ని నిలబెట్టేందుకు సోషల్ మీడియా మొత్తం కదిలింది. #SavePunarvika పేరుతో వేలల్లో పోస్టులు కనిపిస్తున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా ఎక్కడ చూసినా పునర్వికకు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. 11 నెలల చిన్నారి ప్రాణం కాపాడేందుకు ఇన్ ఫ్లుయెన్సర్లు అంతా పోస్టులు, స్టోరీలు పెడుతున్నారు. అయితే పాప బ్రతకాలంటే రూ.16కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం ఉండగా ఇప్పటి వరకు మొత్తం రూ.8.53 కోట్లు ఫండ్స్ ద్వారా వచ్చినట్టు ఫండ్స్ సేకరిస్తున్న టీమ్ సభ్యులు తెలిపారు.

ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఎక్కడ నుండి డబ్బులు కలెక్ట్ చేశారు. ఎంత ఎంత కలెక్ట్ చేశారు అనే వివరాలను వీడియోలో చెప్పారు. ఇంజెక్షన్ కోసం ఈ డబ్బు సరిపోదు కాబట్టి మిగితా డబ్బును ఏపీ ప్రభుత్వం సమకూర్చబోతున్నట్టు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఏకంగా రూ.8కోట్ల ఫండ్ రావడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఇంజక్షన్ వల్ల పాప పూర్తిగా కోలుకుంటే ఆ క్రెడిట్ సోషల్ మీడియాకు. అందులో పాప ఫండింగ్ కోసం వీడియోలు చేసినవారికే దక్కుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఎవరు ఈ పునర్వికశ్రీ?

ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన మంగలి సురేశ్ కుమార్, పుష్పవతి దంపతుల కుమార్తెనే పునర్వికశ్రీ. చిన్నారి వయసు కేవలం 11 నెలలు మాత్రమే కాగా ఆరు నెలల నుండి శరీరాన్ని కదిలించలేకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మొదట కర్నూలులో చూపించగా అక్కడి వైద్యుల సలహాతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా డాక్టర్లు చిన్నారి స్పైన్ మస్క్యులర్ అట్రోఫీ అనే జన్యుపరమైన సమస్యతో బాధపడుతోందని గుర్తించారు.

ఈ వ్యాధి వల్ల కండరాలు బలహీనపడటం,శ్వాస, మింగడం, కదల్లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. దీనికి చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇంజక్షన్ కోసమే రూ.16 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో ఓ వ్యక్తి పాప పరిస్థితి గురించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా మొత్తం కదిలింది. పాప ప్రాణాన్ని నిలబెట్టడంతో పాటు సోషల్ మీడియాను మంచికి వాడితే ఎలా ఉంటుందో చూపించింది.

Next Story