- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: మనస్పూర్తిగా ఒప్పుకుంటారా.. లేదా..?
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం 'శక్తి టీమ్స్' నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ఈవ్ టీజింగ్ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
మూలపేట పోర్టు క్రెడిట్ మాదే!
గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులను పరుగులు పెట్టిస్తున్నామని అనిత పేర్కొన్నారు. మూలపేట పోర్టు పనుల్లో 70 శాతం పూర్తి చేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వమేనని ఆమె గుర్తు చేశారు. ప్రతి చిన్న విషయానికి తామే కారణమని వైసీపీ నేతలు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. తమది ప్రజల ప్రభుత్వమని.. గత పాలకుల్లా ప్రాజెక్టుల్లో వాటాలు, భాగస్వామ్యాలు అడిగే ప్రభుత్వం కాదని అనిత విమర్శించారు.
మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా?.. లేదా..?
రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరిని హోంమంత్రి అనిత నిలదీశారు. మండలిలో తీర్మానం చేయాలని కోరుతున్న వైసీపీ నేతలు, అసలు అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఒకవేళ అమరావతి అభివృద్ధిని స్వాగతిస్తుంటే అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరుకావడం లేదన్నారు. అభివృద్ధి పేరిట రైతులను కన్నీరు పెట్టించడం తమ విధానం కాదని అనిత స్పష్టం చేశారు.
మా లక్ష్యం అదే..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అనిత వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో కమీషన్ల కోసం వేధించడం వల్లే చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయాయని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని, సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తామని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.






