ఆసుపత్రికి, జైలుకు మళ్లీ వెళ్లకూడదు: హోంమంత్రి అనిత

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. తొలుత తిరుపతి సబ్‌ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు..

ఆసుపత్రికి, జైలుకు మళ్లీ వెళ్లకూడదు: హోంమంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District)లో హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) పర్యటించారు. తొలుత తిరుపతి సబ్‌ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఖైదీల భద్రత, జైలు నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ తిరుపతి సబ్‌ జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటంతో కొత్త సబ్‌ జైలు నిర్మాణంపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అవసరమైతే ఖైదీలను ఇతర జైళ్లకు తరలించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఖైదీల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. “ఆసుపత్రికి, జైలుకు మళ్లీ వెళ్లకూడదు” అనే భావనతో పునరావాస కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పెరోల్‌పై విడుదలైన వారిపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

పోలీసింగ్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు

అనంతరం శ్రీకాళహస్తి కొత్తపేట వద్ద రూ.2.75 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, మెరుగైన సేవలు అందించడంపై అధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేర నియంత్రణ, ఆధునిక సాంకేతికత వినియోగం, బలమైన పోలీసింగ్ వ్యవస్థ నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తోందని వంగలపూడి అనిత తెలిపారు.

Next Story